నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ నాయకులు తమ స్థలం కాజేసి బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ శ్రీదేవి అనే మహిళ అధికారులను వేడుకున్నారు. 2021లో వైసీపీ నేతలు గుర్రాల నాగేంద్రప్రసాద్, అతడి కుమారుడు అనిల్, మరికొందరు తమ స్థలాన్ని కబ్జా చేశారని తెలిపింది. న్యాయం చేయాలని కాళ్లరిగేలా తిరిగినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడంలేదని వారి ముందు వాపోయారు. ఆదివారం రాత్రి కూడా ఆమెను బెదిరించినట్లు తెలిపింది. దీంతో కాకినాడ కలెక్టరేట్ వద్దకు వచ్చిన శ్రీలత తన వెంట తీసుకొచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మహిళ బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మహిళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం ప్రస్తుతం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.