నవతెలంగాణ – హైదరాబాద్: దామోదరం సంజీవయ్యనగర్‌లో నివాసముంటున్న ఓ మహిళ ఆదివారం అదృశ్యమైంది. మధ్యాహ్నం నుంచి ఆమె కనిపించకపోవడంతో ఇంటికి సమీపంలోనే ఉన్న హుస్సేన్‌సాగర్ నాలాలో పడి గల్లంతై ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దామోదరం సంజీవయ్యనగర్ సమీపంలోని హుస్సేన్‌సాగర్ నాలా పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న జి. లక్ష్మి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బయట నుంచి వచ్చి గ్యాస్ స్టౌపై బియ్యం పెట్టి, తన సెల్‌ఫోన్ చార్జింగ్‌కు పెట్టింది. ఆమె చెప్పులు కూడా ఇంటి బయటనే ఉన్నాయి. అయితే, మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కూతురు సుజాతకు ఇంటి తలుపులు తెరిచి కనిపించాయి. తల్లి కనిపించలేదు. దీంతో తల్లి కోసం కూతుళ్లు పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, సమాచారాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులకు అందించారు. వెంటనే రంగంలోకి దిగిన డిజాస్టర్ టీమ్ లక్ష్మి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సాయంత్రం వరకు ఆచూకీ లభించకపోవడంతో ఆమె నాలాలో పడి ఉండవచ్చనే అనుమానాలను కుంటుంబ సభ్యులు, బస్తీవాసులు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచనశ్రీ, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ, బీజేపీ నాయకులు జి. వెంకటేశ్, బీఆర్‌ఎస్ భోలక్‌పూర్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, బీజేపీ అధ్యక్షుడు ఎంసీ మహేందర్ బాబుతో పాటు పలువురు నాయకులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లక్ష్మి నాలాలో పడి గల్లంతైందా.. అన్న విషయమై పోలీసులు, డిజాస్టర్ టీం సిబ్బంది గాలించి ధృవీకరించాలని కోరారు.