– నేరాలు.. ఘోరాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలి : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలు, బాలలపై పెరుగుతున్న లైంగిక దాడుల పట్ల సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్ వెంటనే స్పందించి బాధితులకు భద్రత, భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై అక్కడి ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. వరంగల్ లా విద్యార్థినిపై.. హైదరాబాద్లోని ఓ పాఠశాలలో నాలుగేండ్ల బాలికపై, మహబూబ్ నగర్ జిల్లా, బాలనగర్ మండలం లోని తండాలో 15ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది.
ఇలాంటి దారుణాలు సభ్యసమాజాన్ని నివ్వెర పరుస్తున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళాలపై ఏదో ఒక మూల ఇలాంటి నేరాలు,ఘోరాలు జరుగుతున్నాయని తెలిపారు. వెలుగులోకి రాని ఘటనలు కూడా ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశారు. బాలికలు, మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టాడానికి నిందితులకు వెంటనే శిక్షలు పడేట్టు చర్యలు తీసుకోవాలనీ, షిటీమ్స్ రాష్ట్రమంతా విస్తరింప చేసి పకడ్బందీగా భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులను అరికట్టాడానికి ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలనీ, ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్ లైన్ నెంబర్కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. స్త్రీ స్థాయిని దిగజార్చే అంశాలు, వ్యాఖ్యానాల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.