– వివో ఏ బాబా గౌడ్ ఇంటికి తాళం
– అధికారులు పట్టించుకోవడంలేదనే తాళం
నవతెలంగాణ – తాడ్వాయి
తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో వివోఏ తాటిపాముల బాబా గౌడ్ ఇంటికి ఆదివారం మహిళా సంఘాల సభ్యులు తాళం వేశారు. ఇంట్లో ఉన్నవారిని బయటకు పంపించి తాళం వేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. తమ సంఘాలలో స్వాహా చేసిన సొమ్మంతా రికవరీ అయ్యే వరకు ఇంటికి వేసిన తాళం తీయబోమని హెచ్చరించారు.. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు బాబా గౌడ్ ఇంటిముందు బైఠాయించి నిరసన తెలిపిన ఏ అధికారి స్పందించలేదని మండిపడ్డారు. అనంతరం రాత్రి అక్కడే వంటావార్పు చేసుకుని భోజనం చేసి నిరసన తెలిపిన ఒక్క అధికారికైన చీమకుట్టినట్టు లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.సంఘాలలోని డబ్బులను దర్జాగా దోచుకున్నాడని విచారణలో తేలిన అధికారులు పట్టించుకోరా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. తాము నెలనెలా సంఘంలో డబ్బులు జమ చేసుకొని ఆర్థికంగా బలోపేతం అవుదాం అనుకుంటే సంఘంలో విధులు నిర్వహిస్తున్న వివోఏ మాకు తెలియకుండా చాకచక్యంగా మా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని డబ్బులను స్వాహా చేశారని తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ కు వివరించిన కలెక్టర్ సైతం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కలెక్టరే స్పందించకుంటే తమ బాధను ఎవరికి తెలుపాలని బోరుమని వినిపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మా డబ్బులు రికవరీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు