ఉన్నత విద్యలో మహిళలకు మరింత మద్దతు అవసరం

in higher education Women need more support– పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో ఆసక్తి కనబరుస్తున్న అతివలు
– గ్రామీణ ప్రాంత స్త్రీలకు పలు అడ్డంకులు
2012-13 నుంచి 2021-22 వరకు ఉన్న డేటాను పోల్చి చూస్తే.. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, మెడిసిన్‌, లా, మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లో మహిళా పీహెచ్‌డీ పెరుగుదల కనిపించింది. పురుష-ఆధిపత్య రంగాలలో మహిళలు ఎక్కువ భాగస్వామ్యాన్ని సూచిస్తున్నారు. పీజీ స్థాయిలో, సాంఘిక శాస్త్రాలు, సైన్స్‌, వాణిజ్య విద్య వంటి రంగాలు కూడా మహిళా విద్యార్థుల నమోదులో పెరుగుదలను చూశాయి. ఈ తీరు భారత్‌లోని మహిళలకు ఉన్నత విద్య, వృత్తి అవకాశాల అభివృద్ధి చెందుతున్న దృగ్విషయాన్ని చూపిస్తున్నదనని విద్యావేత్తలు అంటున్నారు.
న్యూఢిల్లీ : భారత్‌లోని బాలికలు, మహిళలు.. బాలురు, పురుషులకు మించి చదువుల్లో రానిస్తున్నారు. ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నారు. అయితే, సామాజిక, ఆర్థిక, సాంప్రదాయకంగా వస్తున్న కొన్ని పరిస్థితులు వారిని ఉన్నత చదువులకు దూరం చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఎదుర్కొని ఎందరో మహిళలు పీజీలు, పీహెచ్‌డీలు వంటి ఉన్నత చదువులను చదువుతున్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అయితే, కొంత మంది మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు ఉన్నత విద్యను పొందటంలో అనేక అవాంతరాలను ఎదుర్కొంటున్నారని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరాలు మారినా.. సాంకేతిక విప్లవం వచ్చినా.. ఇలాంటి మహిళలకు మాత్రం ఇప్పటికీ ఉన్నత విద్య అనేది కష్టంగా మారుతున్నదని చెప్తున్నారు. దేశంలో లక్షలాది మంది మహిళలు తాము ఉన్నత చదువులు చదువుకోవాలని అనుకున్నా.. వారికి మాత్రం తగిన తోడ్పాటు, మద్దతు మాత్రం లభించటంలేదని మేధావులు, విద్యావేత్తలు, నిపుణులు అంటున్నారు.
ఒక దేశ శ్రేయస్సు బాగా చదువుకున్న శ్రామికశక్తిపై ఆధారపడి ఉంటుంది. విజ్ఞానం, నైపుణ్యాలతో కూడిన వ్యక్తులు వినూత్న ఆలోచనలను రూపొందించగలరు. ఇది మెరుగైన ఉద్యోగ అవకాశాలకు, ఉత్పాదకతను పెంచటానికి, ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది. విద్య ఈ తక్షణ ప్రయోజనాలకు మించి, సాధికారత, సామాజిక మార్పు కోసం శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. ప్రత్యేకించి మహిళలకు విద్యాబోధన చేయడం వల్ల గణనీయమైన సామాజిక ప్రయోజనాలు లభిస్తాయని విద్యావేత్తలు, నిపుణులు, సామాజికవేత్తలు అంటున్నారు.
ఆర్థిక, సామాజిక, మానవాభివృద్ధిలో ఉన్నత విద్య కీలక పాత్రను గుర్తిస్తూ.. లింగ భేదం లేకుండా పౌరులందరికీ అందుబాటులో ఉండాలి. పురుషులతో పాటు మహిళలూ ఉన్నత విద్యకు నోచుకోవాలి. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, డాక్టరేట్‌ వంటి ఉన్నత విద్యను నోచుకోక లక్షలాది మంది మహిళలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని విద్యావేత్తలు అంటున్నారు.
స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్‌) అనేది ఉన్నత విద్యను పొందటానికి సంబంధించిన కొలమానం. ఇది 18-23 సంవత్సరాల వయస్సు గల మొత్తం జనాభాకు ఉన్నత విద్యా సంస్థలలో నమోదు చేయబడిన విద్యార్థుల నిష్పత్తిగా లెక్కించబడుతుంది. ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(ఏఐఎస్‌హెచ్‌ఈ) నివేదిక ప్రకారం.. పురుషుల జీఈఆర్‌ గణనీయంగా మెరుగుపడింది. ఇది 2012-13లో 22.7 శాతం నుంచి 2021-22లో 28.3 శాతానికి పెరిగింది.
అదే సమయంలో, మహిళా విద్యార్థులకు 20.1 శాతం నుంచి 28.5 శాతానికి వృద్ధిని కనబరిచింది. ఈ ట్రెండ్‌ 2019-20లో పరాకాష్టకు చేరుకున్నది. గత దశాబ్దంలో పురుషులతో పోలిస్తే మహిళల నమోదులో అధిక పెరుగుదల ఉన్నట్టు పై సంఖ్య చూపుతున్నది. 2012-13లో, పురుషులకు జీఈఆర్‌ 22.7 శాతంగా, మహిళలకు ఇది 20.1గా ఉన్నది. 2012-13 నుంచి 2021-22 వరకు ఉన్న విశ్లేషణ భారతదేశంలోని వివిధ విద్యా స్థాయిలు, విభాగాలలో మహిళల నమోదులోని నమూనాలను వెల్లడిస్తుంది. 2021-22లో సామాజిక శాస్త్రాలు అత్యధిక మహిళా విద్యార్థులతో (11.93 శాతం), సైన్స్‌ (9 శాతం), భాషలు (8.45 శాతం), వాణిజ్యం (6.24 శాతం), మేనేజ్‌మెంట్‌ (5.97 శాతం)తో పీజీ స్థాయిలో అగ్రస్థానంలో ఉన్నాయి. . అయితే, పీహెచ్‌డీ స్థాయిలో అత్యధిక మహిళా విద్యార్థుల ప్రాతినిధ్యంతో సైన్స్‌(10.68 శాతం) ఉద్భవించింది. తర్వాత ఇంజనీరింగ్‌, టెక్నాలజీ (8.44 శాతం), సామాజిక శాస్త్రాలు (5.82 శాతం)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
సామాజిక నిబంధనలు, ఇతర సామాజిక-ఆర్థిక కారకాలు ఇప్పటికీ బాలికలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యను అభ్యసించటాన్ని నిరోధిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో, సామాజిక నిబంధనలను పరిష్కరించటానికి, మార్గనిర్దేశక కార్యక్రమాల వంటి లక్ష్య మద్దతును అందించడానికి నిరంతర ప్రయత్నాలు అవసరమని సామాజికవేత్తలు, కార్యకర్తలు అంటున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Spread the love