– రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
– మహిళలు ప్రశ్నించాలి :సుధామూర్తి
– ఓయూలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్
నవతెలంగాణ-ఓయూ
మహిళలు మార్పునకు ప్రధాన పాత్రధారులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. శనివారం హైదరాబాద్ ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ”ఆల్ ఇండియా ఉమెన్ అకాడెమిషన్స్ కాన్ఫరెన్స్” ”ఎన్విజనింగ్ న్యూ భారత్” అనే థీమ్‌తో, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఫ్‌ు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసర్చ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు మద్దతు ఇవ్వడానికి ఫెమినిస్ట్ దృక్పథాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇది భారతీయ సాంస్కృతిక విలువలకు అనుగుణంగా ఉంటుందని అన్నారు. కొత్తదనాన్ని వెతకడం కంటే సంప్రదాయ ఆలోచనలను పునర్నిర్మించడం, పునరుద్ధరించడం అవసరమని తెలిపారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి మాట్లాడుతూ.. మహిళలు సమాజానికి విలువల ను అందించడంలో కీలక పాత్ర పోషించారనే విషయాన్ని గుర్తు చేశారు. మహిళలు ప్రశ్నించాలని, వారికి మార్గనిర్దేశం చేయడం తప్ప, నియంత్రించకూడదని తెలిపారు. సవాళ్లను ఎదుర్కొనడం, కఠిన పరిస్థితులను అధిగమించడం, విద్యార్థులకు విలువలు నేర్పించడం ముఖ్యమని చెప్పారు. ఇతరులతో కాకుండా మనతో మనం పోటీపడటమే మక్కువగా ఉండాలని అన్నారు. ఉపాధ్యాయులు మార్పును తీసుకురావడానికి తమ శక్తిని ఉపయోగించాలని సూచించారు. ఏబీఆర్‌ఎస్‌ఎం నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుంత లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, ముఖ్యంగా మహిళా విద్యావేత్తలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు పరస్పరం ఆలోచనలు పంచు కోవడం, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురాగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐసీఎస్‌ఎస్‌ఆర్, ఎస్‌టీసీ డైరెక్టర్ డా.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సదస్సు మహిళా ఉపాధ్యా యులను శక్తివంతం చేయడంలో కీలకంగా ఉందని ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా మహిళా ఉపాధ్యా యుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, సహకారం, మద్దతు, వృత్తిపరమైన అభివృద్ధి కోసం ఈ ప్రయత్నం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. జేఎన్‌యూ వీసీ ప్రొ.శాంతిశ్రీ పండిట్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో మహిళా నాయకత్వం కీలకమని, పురుషుల కంటే సమావేశ మందిరంలో ఎక్కువ మంది మహిళలు ఉండటం అందుకు సంకేతమని అన్నారు. మహిళలు మరింతగా నాయకత్వ భూమికలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ విజయభారతి.. మహిళలను రక్షించడంలో, శక్తివంతం చేయడంలో కమిషన్ పాత్రను చర్చించారు.సవాళ్లను అధిగమించడంతో పాటు, హక్కులు కోల్పోయిన వ్యక్తులందరికీ న్యాయం అందించడంలో కమిషన్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అదనంగా, వివిధ శాఖలు, రంగాల్లో సహకారం పెంపొందించడానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ మహిళల కోసం అనేక శిక్షణా కార్యక్రమాలు, సమావేశాలు, వర్క్‌షాప్‌లు నిర్వ హించినట్టు తెలిపారు. మహిళా సాధికారత అవసరాన్ని ప్రస్తావించి, పురుషుల దృక్పథంలో మార్పు అవసరమని ఐఏఎస్ అధికారి దేవసేన సూచించారు. మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం ఆపి, ఇంటిలో, పని ప్రదేశంలో వారికి మరింత స్వేచ్ఛను ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కిషన్, ప్రొఫెసర్ కవితా దేవి తదితరులు పాల్గొన్నారు.