మహిళలకు సమాన హక్కులు కల్పించాలి

మహిళలకు సమాన హక్కులు కల్పించాలి– ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ – కరీంనగర్‌
సమాజంలో సగభాగమైన మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రం కోతిరాంపూర్‌లోని ముకుందలాల్‌ మిశ్రా భవన్‌లో జిల్లా ఉపాధ్యక్షులు ద్యావ అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించిన ఐద్వా జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఆరు హామీలిచ్చిందని, అందులో మూడు అమలు చేయడం అభినందనీయమన్నారు. మహిళలకు నెలకు రూ.2500, అర్హులైన మహిళలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న పేద మహిళలకు నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల చులకనభావంతో ఉందని, మహిళా రెజ్లర్లను బీజేపీ నాయకులు వేధించడం, మణిపూర్‌లో మహిళల్ని నగంగా ఊరేగించినా నరేంద్ర మోడీ పెదవి విప్పకపోవడం విచారకరమన్నారు. ఉన్నావ్‌, ఖతువా, బల్కిస్‌భానో లాంటి అనేక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళల్ని వంటింటి కుందేళ్లుగా అభివర్ణిస్తూ, కేంద్ర బీజేపీ మంత్రి మాట్లాడడం విచారకరమని, బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల చెప్పేది ఒకటి, చేసేది మరొకటని విమర్శించారు. నిత్యం మహిళలు, గృహిణులు, విద్యార్థులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐద్వా పోరాటం చేస్తోందని తెలిపారు. కరీంనగర్‌లో జులై 25, 26, 27, 28వ తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శిక్షణా తరగతుల్లో మూడేండ్ల ఐద్వా ఉద్యమ కర్తవ్యాలను సమీక్షించుకొని, భవిష్యత్‌లో మహిళా సమస్యల పట్ల మరిన్ని ఉధృత పోరాటాలు రూపొందించుకోనున్నట్టు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, వివక్షత లేని సమానత్వం కోసం మరిన్ని రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శిక్షణా తరగతులను జయప్రదం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, దాతలు సహకరించాలని కోరారు. సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి, ఉపా ధ్యక్షురాలు గుడికందుల సంధ్య, ఎడ్ల రజిత, స్వరూప, పి.దేవేంద్ర, మాదాసు యమున, రజిత, రోజా రమణి, పద్మ, రజిత తదితరులు పాల్గొన్నారు.

Spread the love