మియాపూర్‌ భూముల నుంచి కదలని మహిళలు

మియాపూర్‌ భూముల నుంచి కదలని మహిళలు– ఘటనా స్థలానికి అధికారులు
– నచ్చజెప్పే యత్నం
– అధికారులపైకి రాళ్లు రువ్విన కొందరు
– ఓ అధికారికి గాయం, ఆటో అద్దాలు ధ్వంసం
నవతెలంగాణ-మియాపూర్‌
రంగారెడ్డి జిల్లా మియాపూర్‌ భూముల్లో ఇండ్ల స్థలాలివ్వాలంటూ బైటాయించిన మహిళలు శనివారం కూడా అక్కడే తిష్ట వేశారు. రెండ్రోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు ఆ భూముల్లోనే భీష్మించి కూర్చున్నారు. ఇప్పటి వరకు పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఓ మహిళ ఆధ్వర్యంలో మహిళలు పోరాటం చేస్తుండగా, ఇప్పుడు అదే స్థలాల మీదకు మరో మహిళ మరికొందరిని తీసుకొని వచ్చింది. ఆటోల్లో వందలాది తరలివచ్చిన వారు మియాపూర్‌ సర్వేనెంబర్‌ 100, 101లోని భూముల్లో ఎవరికి వారు తాళ్లు కట్టి, చీరలతో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. దీప్తి శ్రీనగర్‌నగర్‌ నుంచి శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కార్యాలయం ఎదుట ఈ ఆందోళన జరుగుతున్న సమయంలోనే మరోవర్గం భూ ఆక్రమణకు తెరలేపింది. శనివారం ఉదయం రెవెన్యూ, పోలీసు, హెచ్‌ఎండీఏ అధికారులు మరోసారి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు.
కొద్దిసేపు ఉద్రిక్తత
పోలీసులు, ఆక్రమణదారుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏసీపీ నర్సింహారావు, సీఐ, పోలీసులు అధికారులు వచ్చి ప్రజలకు నచ్చజెప్పి సగం మందిని అక్కడి నుంచి పంపించారు. మరికొంత మంది అక్కడే బైటాయించారు. సాయంత్రం పోలీసులు, ఆక్రమణదారుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు బందోబస్తు పెంచి జనాలను అక్కడి నుంచి చదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆక్రమణదారులలో కొంత మంది వ్యక్తులు వెనుక నుంచి పోలీసులపైకి రాళ్లువిసిరారు. దీంతో పోలీసులు కొంతదూరం ఘటన స్థలం నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో హెచ్‌ఎండీఓ సైట్‌ అధికారి రఘుకి గాయమైంది. పోలీసులు అనౌన్స్‌ చేసేందుకు తీసుకొచ్చిన ఆటో అద్దాలను పగులగొట్టారు. పోలీసులు జనాలను చదరగొడుతున్నా.. మరో వైపు నుంచి అక్కడికి చేరుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. వారు ఉంటున్న ప్రాంతాల్లోనే దరఖాస్తులు చేసుకోవాలని, అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇండ్లు ఇస్తుందని తెలిపారు. అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరగా.. కొందరు వెళ్లి పోయారు. మరికొందరు అక్కడే ఉండిపోయారు.

Spread the love