నవతెలంగాణ – టోక్యో : జపాన్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మహిళలు సీట్లను గెలుచుకున్నారు. రికార్డు స్థాయిలో మహిళలు జపాన్ ప్రతినిధుల సభకు ఎన్నుకోబడినట్లు సోమవారం అంచనా వేసింది. అయితే 16 శాతం కన్నా తక్కువ… ఇంకా మైనారిటీలో కొనసాగుతున్నారు. 465 సీట్లు కలిగిన దిగువసభలో 73 సీట్లను మహిళలు గెలుచుకున్నట్లు ప్రభుత్వ మీడియా ఎన్‌హెచ్‌కె అంచనా వేసింది. ఈ రోజు తర్వాత అధికారిక ఫలితాల్లో ఈ గణాంకాలు ధృవీకరించబడతాయని భావిస్తున్నారు. 2021 సాధారణ ఎన్నికల్లో దిగువసభకు 45 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మహిళలు పోటీ చేస్తున్నారని, దాదాపు నాలుగవ వంతు అభ్యర్థులు ఉన్నట్లు ప్రభుత్వ మీడియా, ఇతర సంస్థలు ప్రకటించాయి. జపాన్‌లో ఇప్పటికీ వ్యాపారాలు, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందని, 146 దేశాల జాబితాలో జపాన్ 118 ర్యాంకులో ఉన్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కి చెందిన ప్రపంచ లింగ అసమానత సూచీ నివేదిక పేర్కొంది.
ప్రధాని షిగెరు ఇషిబాకి చెందిన 20 మంది సభ్యుల క్యాబినెట్‌లోనూ కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. పురుషాధిక్యత, నిష్పక్షపాత లేని జపాన్ రాజకీయ పార్టీల్లో మహిళా అభ్యర్థులను గుర్తించడం కష్టమని గత నెలలో పాలక పార్టీ నాయకత్వ ఓటుకు ముందు ‘నో యూత్ నో జపాన్’ సంస్థ అధినేత మొమోకో నోజో చెప్పారు. 2021లో నిర్వహించిన క్యాబినెట్ ఆఫీస్ సర్వేలో జపాన్‌లోని మహిళా ఎన్నికల అభ్యర్థులలో నలుగురిలో ఒకరు తమ ప్రచార సమయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లు జిజి ప్రెస్ పేర్కొంది. ఆదివారం ఎన్నికల్లో ఇషిబా అధికార కూటమి ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో పార్లమెంట్‌లో మెజారిటీని కోల్పోవచ్చని అంచనా. ఇషిబా అక్టోబర్ 1న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సాధారణ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. స్లష్ ఫండ్ కుంభకోణంతో ఆదివారం జరిగిన ఓటింగ్‌లో ఆయన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) ఆధిక్యతను కోల్పోయినట్లు మీడియా తెలిపింది.