ఆరోగ్య మహిళా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

– కలెక్టర్‌ ప్రియాంక అలా
నవతెలంగాణ-అశ్వాపురం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా కేంద్రాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రియాంక అలా కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ ఆరోగ్య మహిళా కేంద్రంలో ప్రతి మంగళవారం 8 రకాల వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలను ప్రత్యేక మహిళ వైద్య నిపుణుల చేత పరీక్షిస్తారన్నారు. రక్త పరీక్షలు నిర్వహించి బ్రెస్ట్‌ కాన్సర్‌తో పాటు మరి ఇతర రకాల క్యాన్సర్‌ను కనుగొనేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచాలి : కలెక్టర్‌
మండలంలోని 74 అంగన్వాడీ కేంద్రాలలో పరిసరాల పరిశుభ్రతను చేపట్టాలని మండల పంచాయతీ అధికారి శ్రీనివాసును కలెక్టర్‌ ఆదేశించారు. శుభ్రపరచిన తరువాత అన్ని కేంద్రాల పోటోలను తనకు పంపాలన్నారు. మండల కేంద్రంలోని ఐదవ అంగన్వాడీ సెంటర్‌ను ఆమె పరిశీలించారు. అక్కడికి చేరుకున్న బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని అందజేసి, మాట్లాడారు. అనంతరం సీతారామపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాంబాబు, అడిషనల్‌ డీఅండ్‌ఎంహెచ్‌ఓ, ఐసీడీఎస్‌ పీడీ వేల్పుల విజేత, ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షణ, తహశీల్దార్‌ రమాదేవి, వైద్య అధికారి సంకీర్తన, సీడీపీఓ సీతారాములు, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Spread the love