నవతెలంగాణ – న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ఈ బిల్లు బుధవారం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. నేడు రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. చర్చ పూర్తయిన అనంతరం ఓటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ బిల్లులోని నిబంధనలు మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రధాని దయ కాదని కాంగ్రెస్ ఎంపి రంజీత్ రంజన్ మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం మహిళలను ఎంతగా గౌరవిస్తుందో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ ఎదుట రెజ్లర్లు చేపట్టిన ఆందోళన, మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటనలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళలు హక్కులను కోరుకుంటున్నారని, జాలి కాదని స్పష్టం చేశారు. మరోవైపు లోక్ సభలో చంద్రయాన్ -3 ద్వారా ఇస్రో సాధించిన విజయంపై చర్చ జరుగుతోంది. ఈ ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్ 3 విజయం దేశాన్ని గర్వించేలా చేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికీ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగేందుకు యత్నిస్తున్నాయని.. కానీ భారత్ ఆ విజయాన్ని సాధించి.. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా ప్రపంచంలో ఖ్యాతిని సొంతం చేసుకుందని అన్నారు.