కష్టపడండి…గెలుపు మనదే

– బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కలిసినా కాంగ్రెస్‌ను ఏమీ చేయలేవు…
– ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాబోతోంది
– మోడీ హామీలకు గ్యారంటేదీ?
– బీజేపీ వైపే కేసీఆర్‌ చూపు
– ప్రజల సొమ్ముతో మోడీ వ్యక్తిగత ప్రచారమా? : కాంగ్రెస్‌ బూత్‌స్థాయి కన్వీనర్ల సమావేశంలో ఖర్గే
– ప్రభుత్వాలను కూల్చే బీజేపీతో జాగ్రత్త అంటూ రేవంత్‌కు సలహా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం కష్టపడి పని చేయాలనీ, బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసినా తమ పార్టీని ఏమీ చేయలేవని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ఇండియా’ కూటమి దేశంలో అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రజల సొమ్ముతో వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినమేరకు రెండు కోట్ల ఉద్యోగాలకు, ప్రతి ఖాతాలో రూ 15 లక్షలు జమ చేస్తామన్న హామీలకు గ్యారంటీ ఏది? అంటూ మోడీని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక రాష్ట్ర ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసిందన్నారు. బీజేపీతో జర జాగ్రత్త అంటూ రేవంత్‌కు సూచించారు. మోడీ బెదిరింపులకు కాంగ్రెస్‌ భయపడబోదని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీస్డేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్‌ బూత్‌ స్థాయి కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోడీ ఇచ్చిన అన్ని హామీలపై ప్రశ్నిస్తామన్నారు. దేశంలో ఏ ఒక్కరికీ పనులు లేకుండా చేశారని విమర్శించారు. పని లేకపోతే ప్రజలకు ఉపాధి ఎలా..? వారి కడుపు ఎలా నిండుతుందని ప్రశ్నించారు. మోడీ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తున్నామం టూనే బలహీన పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బూత్‌ ఏజెంట్లు అత్యంత కీలకం
రెండు నెలల్లో పార్లమెంట్‌ ఎన్నికలు ఉన్నాయనీ, బూత్‌ ఏజెంట్లు అత్యంత కీలకంగా పని చేయాలని ఖర్గే ఈసందర్భంగా సూచించారు. ప్రతిపక్షాలను బీజేపీ భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ చెప్పారు. కానీ బీజేపీకి రాష్ట్రంలో ఎవరూ భయపడరని హెచ్చరించారు. బీజేపీపై కేసీఆర్‌ ఎప్పుడూ ఆరోపణలు చేయలేదన్నారు. ఆయన బీజేపీకి మద్దతిస్తారని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లను కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఓడించిందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘మనం ప్రజల మధ్య ఉంటే గెలుస్తాం.లేకపోతే ఓడిపోతాం’ అంటూ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. క్యాడర్‌ గ్రామ, బూత్‌ స్థాయిలో పని చేయాలని సూచించారు. గ్రామ, బూత్‌ స్థాయిలో పని చేసి రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పని చేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి కార్యకర్తల కృషి ఫలితంగా రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పని చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో అప్పుడే రెండు గ్యారంటీలు అమలు చేశామని గుర్తు చేశారు. తమ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని గ్యారంటీలనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాహుల్‌ మణిపూర్‌ నుంచి భారత్‌ న్యాయ యాత్ర ప్రారంభిస్తే యాత్రకు బీజేపీ అడ్డంకులు సృష్టిస్తున్నదని చెప్పారు. అయినా రాహుల్‌గాంధీ ధైర్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. యువత, మహిళ, దళిత, గిరిజన ప్రజల కోసం రాహుల్‌గాంధీ కష్ట పడుతున్నారని వివరించారు. ఇక్కడ కష్టపడి ఎలాంటి ఫలితాలు తెచ్చారో దేశంలో కూడా అలాంటి ఫలితాలను తేవాలని ఆకాక్షించారు. ఇక్కడ ప్రభుత్వ పని తీరు, రేవంత్‌ రెడ్డి పని తీరు ఆదర్శంగా ఉందని అభినందించారు.
బీజేపీ కూల్చే పార్టీ…కాంగ్రెస్‌ నిర్మించే పార్టీ.
ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ప్రభుత్వాలను పడగోడతారని ఖర్గే చెప్పారు.అయితే కాంగ్రెస్‌ మాత్రం ప్రభుత్వాలను నిర్మిస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో సమస్యలపై మాట్లాడితే ఎంపీలను సస్పెండ్‌ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారన్నారు. మోడీ పదేండ్లుగా అన్ని సంస్థలను నాశనం చేశారని ఆరోపించారు. ఆయన కుట్రలను బహిర్గతం చేస్తామన్నారు. అయోధ్యలో మోడీ ఒక్కరే గర్భగుడిలో పూజలు చేశారనీ, బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళిమనోహర్‌ జోషీలను ఎందుకు లోపలికి రానివ్వలేదని ఆయన ప్రశ్నించారు. ‘దేశంలో దేవుడు ప్రతి ఇంట్లో ఉన్నాడు.. కానీ దేవుడు తమ దగ్గరే ఉన్నట్టు మోడీ ప్రచారం చేసుకుంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. ఆకలైన వాడికి అన్నం పెట్టాలనీ, ఉపాధి లేని వారికి ఉద్యోగం ఇవ్వాలనీ, కానీ మోడీ ఎన్నికల రాజకీయాలు, ప్రచారంతోనే కాలం గడుపుతున్నారని చెప్పారు. మోడీ, అమిత్‌షాలు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగించి దాడులు చేసే ప్రమాదముందని హెచ్చరించారు. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నాయకులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Spread the love