ప్రమాదవశాత్తు 30వ అంతస్తు నుంచి పడి కార్మికుడు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ 30వ అంతస్తు నుంచి 11 వ అంతస్తులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో కార్మికుడి స్పాట్ లోనే చనిపోయాడు. దీంతో తోటి కార్మికులు సదరు నిర్మాణ కంపెనీపై మండిపడుతున్నారు. కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇకముందైనా కార్మికుల భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్ కు చెందిన  ఖైరుల్మియా బతుకుదెరువు కోసం భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తన మామతో కలిసి పదిహేను రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చాడు. సిటీలో కేఎల్ సీ కంపెనీలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లింగంపల్లిలో కేఎల్సీ సంస్థ చేపట్టిన భారీ భవన నిర్మాణంలో పనిచేస్తుండగా శుక్రవారం ప్రమాదం జరిగింది.

Spread the love