త్రిశంకు స్వర్గంలో వర్కర్‌ టూ ఓనర్‌ స్కీమ్‌

త్రిశంకు స్వర్గంలో వర్కర్‌ టూ ఓనర్‌ స్కీమ్‌– తుది నిర్మాణ దశకు వీవింగ్‌పార్క్‌
– బాలారిష్టాలు దాటుకుని 88 ఎకరాల్లో రూపుదాల్చుకున్న షెడ్ల నిర్మాణం
– పనుల్లేక, ప్రభుత్వ ఆర్డర్లూ లేక నిస్సహాయస్థితిలో పరిశ్రమ
– తాము ఓనర్లమెప్పుడవుతామనే ఆందోళనలో వస్త్ర కార్మికులు
– కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయంపైనే గంపెడాశలు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికున్ని.. యజమానిగా చేస్తామని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘వర్కర్‌ టూ ఓనర్‌’ స్కీమ్‌ బాలారిష్టాలు దాటుకుంటూ ఏడేండ్ల తరువాత ఓ తుది దశకు చేరుకుంది. 88 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన వీవింగ్‌పార్క్‌ ఓ రూపుదాల్చుకుంది. రూ.375 కోట్లతో చేపట్టిన ఈ పార్క్‌లో షెడ్లు, ఇతర ఇంటీరియల్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక వర్కర్‌ ఓనర్‌ అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భావించిన నేపథ్యంలో మగ్గాలు నడవక, ప్రభుత్వ ఆర్డర్లు లేక సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రశ్నార్థకంగా మారింది. వర్కర్‌ టూ ఓనర్‌ స్కీమ్‌ను ‘త్రిశంకు స్వర్గం’లోకి నెట్టేసినట్టయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్‌ నిర్ణయాలపైనే కార్మికులు గంపెడాశలు పెట్టుకున్నారు.
సిరిసిల్ల నేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వర్కర్‌ టూ ఓనర్‌ స్కీమును ఏడేండ్ల కిందట తీసుకొచ్చింది. ఇందుకు సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దూరు శివారులో వీవింగ్‌పార్క్‌ కోసం 88 ఎకరాల భూమి కేటాయించింది. ఈ స్కీమ్‌ రూపకల్పనలో భాగంగా సుమారు ఎనిమిది మంది కార్మికులు ఒకేచోట పని చేసేలా నిర్మాణాలు చేపట్టి దాన్ని ఒక యూనిట్‌గా పరిగణించింది. ఒక్కో గ్రూప్‌ కార్మికులకు పవర్‌లూమ్స్‌ అందజేసి, ప్రతి కార్మికునికీ స్టోర్‌ రూమ్‌ సహా 800 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రతి కార్మికునికీ నాలుగు సెమీ ఆటోమేటిక్‌ పవర్‌ లూమ్‌లు, వైండింగ్‌ మిషన్‌ను అందజేస్తామని ప్రకటించింది. పార్కులో 60 వార్పింగ్‌ మిషన్లనూ ఏర్పాటు చేస్తామని చెప్పింది. మొత్తంగా సిరిసిల్లలోని సుమారు 30వేల మగ్గాలపై పని చేసే 6 వేల మంది కార్మికులు, అనుబంధ రంగాలైన డైయింగ్‌, కండెలు చుట్టడం, బీములు పోసే ఇతరత్రా పనుల్లో కార్మికులను కలుపుకుని మొత్తంగా 10వేల మంది వర్కర్లను ఓనర్లుగా మార్చుతామని గత సర్కారు ప్రకటించింది.
బాలారిష్టాలు దాటుకుంటూ..
2017 అక్టోబర్‌ 11న అప్పటి సీఎం కేసీఆర్‌ ఈ ‘వర్కర్‌ టూ ఓనర్‌’ పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత రూ.220కోట్లతో షెడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు రూపొందించారు. ఈ నిర్మాణాల బాధ్యతను రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) చేపట్టింది. అయితే, ప్రారంభం నుంచి పనులు నత్తనడక సాగుతూ ఏడేండ్ల కాలం గడిచిపోయింది. మధ్యలో ముడిసరుకుల ధరలు పెరగడంతో యూనిట్‌ ధరను రూ.8లక్షల నుంచి రూ.15లక్షలకు పెంచిన గత సర్కారు వ్యయ అంచనాను రూ.375కోట్లకు పెంచింది. మొదటి దశలో 1,104 మంది నేత కార్మికులు కూర్చునేలా వర్క్‌ షెడ్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. షెడ్ల నిర్మాణాలను పూర్తి చేసింది. అందులో 4416 పవర్‌లూమ్స్‌ను సైతం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మిగిలిన షెడ్లు, ఇతర పనులు తుదిదశలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఏడేండ్లలో పనుల పురోగతిపై గత సర్కారు పెద్దగా దృష్టిసారించలేదనే విమర్శలున్నాయి. నిర్మాణ పనులపైగానీ, పురోగతిపైగానీ సమీక్షించిందీ లేదనే వాదనలు ఉన్నాయి. షెడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లోపల ఇంటీరియల్‌ పనులు ఇంకా పూర్తవలేదు. ఆటోమెటిక్‌ మగ్గాలను బిగించేందుకు ఆర్డర్లు ఇవ్వలేదు. ప్రస్తుతం పాత ప్రభుత్వం కొనసాగించిన ప్రభుత్వ ఆర్డర్ల విషయమై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయాన్నీ తీసుకోలేదు. ఇక్కడి చేనేత కార్మికుల సంక్షేమ పథకాల కొనసాగింపుపైనా స్పష్టమైన కార్యాచరణ రూపొందించలేదు. ఈ నేపథ్యంలో ‘వర్కర్‌ టూ ఓనర్‌’ స్కీమ్‌ అమలు ఎప్పుడు ఉంటుందనేది చర్చ నడుస్తోంది.
వర్కర్‌ టు ఓనర్‌ ఉద్దేశమిదీ…
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులను యజమానులుగా చేయడమే వర్కర్‌ టూ ఓనర్‌ ప్రధానోద్దేశం. కార్మికులే యజమానులుగా మారి వస్త్రాలను ఉత్పత్తి చేస్తారు. ఈ పథకం అమలులోకి వస్తే సిరిసిల్లలో దాదాపు పది వేల మంది కార్మికులు ఓనర్లుగా మారనున్నారు. ఒక్కో కార్మికుడికి యూనిట్‌ కింద రూ.8 లక్షల విలువ చేసే నాలుగు ఆధునిక మరమగ్గాలను సమకూరుస్తారు. ఒక్కో షెడ్డులో 8 మంది కార్మికులకు యూనిట్లు కేటాయిస్తారు. ఆధునిక మరమగ్గాలపై వస్త్రాలు ఉత్పత్తి చేసేందుకు కార్మికులకు చేతినిండా పని కల్పిస్తారు. ఈ మొత్తం పెట్టుబడిలో 50శాతం రాయితీని ప్రభుత్వం కల్పించి మరో 40శాతం బ్యాంక్‌ రుణాన్ని అందిస్తారు. మిగిలిన 10శాతం పెట్టుబడిని మాత్రం కార్మికుడు భరించాల్సి ఉంటుంది. ఈ ఆలోచన సక్సెస్‌గా మారితే సిరిసిల్లలోని 30వేల మగ్గాలపై పని చేసే సుమారు 6వేల మంది కార్మికులు, మరో 4వేల మంది అనుబంధ రంగ కార్మికులంతా ఓనర్లుగా మారుతారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయంపై కార్మికులు గంపెడాశలు పెట్టుకున్నారు.

Spread the love