– వేలాదిమంది నిరసన ప్రదర్శనలు !!
– కార్మిక వ్యతిరేక బిల్లుకు ఖండన
ఏథెన్స్ : వేలాదిమంది కార్మికుల జీవితాలపై, జీవనోపాధులపై దాడి చేసేందుకు ఉద్దేశించిన కార్మిక వ్యతిరేక బిల్లును నిరసిస్తూ, వేలాదిమంది గ్రీస్ కార్మికులు గురువారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. కన్జర్వేటివ్ న్యూ డెమోక్రసీ (ఎన్డీ) ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక బిల్లును నిరసిస్తూ ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా ఈ ప్రదర్శనలను జయప్రదంగా నిర్వహించారు. పని ప్రదేశాల్లో ఇతర అనేక రకాల మార్పులతో పాటూ పనిగంటలు పెంచాలని ఈ బిల్లు కోరుతోంది. ఆల్ వర్కర్స్ మిలిటెంట్ ఫ్రంట్ (పిఎఎంఇ), వివిధ రంగాలకు చెందిన ఇతర యూనియన్లు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. బిల్లును ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఏథెన్స్లో వేలాదిమంది కార్మికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. థెస్సాలోనికి, లారిస్సా, పత్రాస్, ఐయోనినా, కార్ఫు, కతేరిని వంటి నగరాల్లో కూడా పెద్ద ప్రదర్శనలు జరిగాయి. నిరసన తెలియచేస్తున్న కార్మిక లోకానికి గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ), కమ్యూనిస్టు యూత్ ఆఫ్ గ్రీస్ (కేఎన్‌ఈ)లు మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించాయి. కాగా, ఈ సమ్మెలో పాల్గొనేందుకు అధికారికంగా పిలుపు ఇవ్వనందుకు జనరల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ గ్రీక్ వర్కర్స్ (జీఎస్‌ఈఈ) నాయకత్వానికి తీవ్రంగా విమర్శలు ఎదురయ్యాయి. ప్రస్తుతమున్న పని గంటలను 8 నుంచి 13కి పెంచాలని, అలాగే అవసరమైతే ఆరు రోజుల పని వారాన్ని అమలు చేసేందుకు యజమానులకు అవకాశం కల్పించాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన కొత్త బిల్లు కోరుతోంది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేదా వేతనం లేకుండానే మొదటి ఏడాదిలోనే ఉద్యోగినిన తొలగించవచ్చు, పని ఆపేసినా, సమ్మెలు చేసినా జరిమానాలు విధించడంతో పాటూ ఆరు మాసాల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారని బిల్లు నిబంధనలు పేర్కొంటున్నాయి. కాగా, కార్మిక లోకం యావత్తూ ఈ బిల్లును తీవ్రంగా నిరసిస్తోంది. గ్రీస్‌లో ఆధునిక బానిసత్వాన్ని అమలు చేసే సాధనంగా విమర్శించింది. గత రెండు మాసాలుగా పెద్ద ఎత్తున సంభవించిన వరదలు, ప్రాణాంతకంగా పరిణమించిన దావానలాలతో జనాభాలో ప్రధానమైన భాగం ఇబ్బందులు పడుతున్న వేళ ఇలాంటి బిల్లు తీసుకురావడాన్ని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏథెన్స్లో ప్రదర్శనలో పాల్గొన్న కేకేఈ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్ కొత్సూమ్‌పాస్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వానికి, బడా యజమానులు, రాజీపడిన జిఎస్‌ఇఇ నాయకత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, కార్మిక సంఘాలు ఉద్యమాల ద్వారా దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైన ప్రతిస్పందన ఇచ్చారని పేర్కొన్నారు.
గ్రీస్ కార్మిక లోకానికి సీఐటీయూ అభినందనలు !
న్యూఢిల్లీ : గ్రీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ హక్కుల పరిరక్షణ కోసం పోరు బాటలో సాగుతున్న గ్రీక్ కార్మిక లోకానికి అంతర్జాతీయ సంఘీభావాన్ని, అభినందనలను సీఐటీయూ తెలియచేసింది. కార్మికుల ఉపాధి భద్రతను గాల్లోకి నెట్టేలా, వారి పనిగంటలను, పని వారాన్ని పెంచేలా కొత్తగా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక బిల్లును తీవ్రంగా నిరసించింది.
కార్మికుల వేతనాలు, పెన్షన్లను స్తంభింపచేయడంతోపాటూ పొదుపు చర్యల డ్రైవ్‌ను చేపడుతున్నట్లు ప్రకటించిన పాలక ఎన్డి ప్రభుత్వం పార్లమెంట్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. రోజుకు 13గంటలు చొప్పున ఆరు రోజుల పాటు పనిచేయాలని ఆ బిల్లు ప్రతిపాదిస్తోంది. వర్క్ బ్రేక్‌ను రద్దు చేయాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటివరకు పలు రంగాల్లో ఐదు రోజుల పనిదినాలు మాత్రమే అమలవుతున్నాయి. పైగా సమ్మె చేసే హక్కును నేరంగా బిల్లు ప్రతిపాదించింది.
ఈ విధానపరమైన దాడులకు నిరసనగా, పిఎఎంఈ గురువారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపిచ్చింది. ఈ సమ్మెకు ప్రజా మద్దతు బ్రహ్మాండంగా లభించింది. ఏథెన్స్, లావ్‌రియో, లెస్వోస్ సహా పలు నగరాల్లో కార్మికుల కార్యాచరణకు సిఐటియు పూర్తి మద్దతును తెలియచేసింది. మొత్తంగా గ్రీస్ కార్మిక లోకాన్ని, ముఖ్యంగా పీఎఎంఈని అభినందించింది. గ్రీస్ కార్మిక లోకం చేపట్టే చర్యలకు సంఘీభావం తెలియచేయాల్సిందిగా దేశ విదేశాల్లోని సోదర కార్మిక సంఘాలను, తను అనుబంధ సంఘాలను, సభ్యులను కోరింది.