నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో, నృత్య ప్రదర్శనలతో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ఏరియాలో ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిచి, ఆదివాసి జండా ఎగరవేశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా నాయకులు, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కొర్నెబెల్లి వీరేశం, మండల కో ఆప్షన్ మహిళా అధ్యక్షురాలు, కామారం సర్పంచ్ రేగ కళ్యాణి లు మాట్లాడుతూ భారతదేశంలో ఆదివాసుల మీద దాడులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు, ఆదివాసులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. ఆదివాసి, గిరిజనుల మధ్య జాతీయ భేదం పెంపొందించి కుల రాజకీయాలను చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదివాసి హక్కులు, చట్టాలు పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గిరిజనోద్యమ నేతల స్ఫూర్తితో వాటి పరిరక్షణకు మరో పోరాటానికి సన్నధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ తోట రవీందర్, స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్, తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు పాయం కోటేశ్వరరావు, ఆదివాసి నాయకులు కల్తీ రమేష్ గౌరవైన రాజబాబు, సీతారాములు, నర్సాపూర్ సర్పంచ్ మంకిడి నరసింహస్వామి, ఆదివాసి ఉద్యోగ సంఘం నాయకులు, తుడుందెబ్బ తదితరులు పాల్గొన్నారు.