సాంకేతిక విద్యకు ప్రపంచబ్యాంక్‌ రుణం

న్యూఢిల్లీ : భారత్‌లో సాంకేతిక విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు 255.5 మిలియన్‌ డాలర్ల రుణాన్ని అందించేందుకు ప్రపంచబ్యాంక్‌ అంగీకరించింది. రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థలలో చదువుకునే మూడున్నర లక్షల మంది విద్యార్థులు దీనివల్ల ప్రయోజనం పొందుతారని ప్రపంచబ్యాంక్‌ తెలిపింది. భారత్‌లో 2011-12లో 40 వేల కళాశాలల్లో 2.9 కోట్ల మంది చదువుకుంటే 2019-20లో 40 వేల యూనివర్సిటీలలో 3.9 కోట్ల మంది విద్యను అభ్యసించారు. అయితే సాంకేతిక, సాంకేతికేతర విద్యల విషయంలో కొంత వ్యత్యాసం కన్పిస్తోంది. సాంకేతిక విద్యా ప్రాజెక్టులలో పరిశోధనలను మరింత మెరుగుపరిస్తే విద్యార్థుల నైపుణ్యం పెరుగుతుందని, వారు తగిన ఉద్యోగాలు పొందగలుగుతారని ప్రపంచబ్యాంక్‌ తెలిపింది.
ప్రాజెక్టులలో భాగంగా విద్యార్థుల పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తారని, మెరుగైన ఇంటర్న్‌షిప్‌, నియామకాల ద్వారా విద్యార్థులు ప్రయోజనాలు పొందుతారని ప్రపంచబ్యాంక్‌ వివరించింది. భారత ప్రభుత్వ జాతీయ విద్యా విధానానికి ప్రాజెక్టులు బాసటగా నిలుస్తాయని ప్రపంచబ్యాంక్‌ భారత డైరెక్టర్‌ అగస్టే టానో కవామే చెప్పారు.

Spread the love