– జాతీయ రహదారిపై పాలమాకుల కేజీబీవీ విద్యార్థినుల ఆందోళన
– సీఎం స్పందించి పరిష్కరించాలని నినాదాలు
– వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం : డీఈఓ
– వెంటనే పరిష్కారించాలి : ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ప్రణయ్
నవతెలంగాణ- శంషాబాద్
పురుగుల అన్నం పెడుతున్నారని, తాగునీటి సౌకర్యం కల్పించడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల కేజీబీవీ విద్యార్థినులు జాతీయ రహదారిపై బైటాయించి ధర్నా నిర్వహించారు. ‘సీఎం రావాలి-న్యాయం చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హాస్టల్‌లో నిర్వహణ లేక దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. పురుగుల అన్నం పెడుతున్నారని, అడిగిన వారిపై కారంతో దాడి చేస్తున్నారని, టీచర్ల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని తెలిపారు. మినరల్ వాటర్‌కు బదులు బోరు వాటర్ ఇస్తున్నారన్నారు. విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా డీఈఓ సుషీందర్ రావు, శంషాబాద్ ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో సమస్యలు తీరుస్తామని డీఈవో సుశింధర్ రావు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.
సమస్యలు వెంటనే పరిష్కరించాలి : ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కేవై ప్రణయ్
కేజీబీవోలో విద్యార్ధుల ధర్నా గురించి తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు కేవై ప్రణయ్.. అక్కడికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితుల గురించి విద్యార్థులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కస్తూర్బా బాలికల వసతి గృహంలో విద్యార్థినులు సమస్యలతో సతమతమవుతున్నారని, ఉద్దేశపూర్వకంగానే టీచర్లు విద్యార్థినులను వేధిస్తున్నారని అన్నారు. కేజీబీవీలో టీచర్ల మధ్య ఆధిపత్య పోరు సమస్యలకు కారణమని, పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సమస్య ముదిరి విద్యార్థుల ప్రాణాల మీదికి వస్తున్నదన్నారు. కుల వివక్ష పాటిస్తున్నట్టు విద్యార్థినులు తమతో చెప్పారని, సమస్యలు అడిగితే బూతులు తిడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి టీచర్లే తల్లిదండ్రులుగా భావించి ఉంటున్న విద్యార్థినులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.