25 రోజులకు చేరిన రెజ్లర్ల ఆందోళన

నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షులు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో రెజ్లర్లు చేస్తున్న ఆందోళన బుధవారం 25వ రోజు పూర్తి చేసుకుంది. బుధవారం రెజ్లర్లు హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షా సహాయం అందించాలని రెజ్లర్లు కోరారు. అలాగే, రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా ప్రముఖ కేథర్నాథ్‌ ఆలయం వద్ద యువ రెజ్లర్లు బ్యానర్‌ ప్రదర్శించారు. కాగా, ఆందోళన ప్రాంగణం జంతర్‌ మంతర్‌ సమీపంలోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించడంతో తమ ఆందోళనను కొనసాగించారు. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్లు, బంగ్లా సాహిబ్‌ గురుద్వారాను కూడా సందర్శించారు.
ఒలింపిక్‌ పతక విజేతలు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, ఆసియా ఛాంపియన్‌ వినేశ్‌ ఫోగట్‌, సంగీతా ఫోగట్‌, ఇతర ప్రముఖ రెజ్లర్లు ఏప్రిల్‌ 23 నుండి దేశ రాజధానిలో బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. మల్లయోధుల ఆలయాన్ని సందర్శించిన అనంతరం బజరంగ్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, హౌంమంత్రి అమిత్‌ షా సహాయం కోసం కోరారు. ”మా గొంతులు ప్రధాని మోడీకి చేరడం లేదని నేను భావిస్తున్నాను. మాకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనను, హౌంమంత్రిని కోరుతున్నాం. ‘బేటీ బచావో బేటీ పడావో’ అంటూ నినాదాలు చేశారు. కాబట్టి ఈ కుమార్తెలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. వారు కూడా దేశం కుమార్తెలు” అని పునియా అన్నారు. ”దేశంలోని ఆడపిల్లలకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా బజరంగ్‌ బలి ఆశీస్సులు పొందేందుకు మేము ఆలయానికి వచ్చాము” అన్నారు.

బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ 25 రోజుల పాటు సాగుతున్న నిరసనలు దేశ దురదృష్టమని వినేశ్‌ ఫోగట్‌ అన్నారు. ”ఇది మన దేశ దురదృష్టం. దేశంలోని ప్రతి ఆడపిల్లకు న్యాయం జరగాలంటే ఆందోళన చేయాల్సిన అవసరం ఉందా? దోషులను శిక్షించలేమా? మన దేశం అంత బలహీనంగా ఉండకూడదు” అని అన్నారు. సాక్షి మాలిక్‌ మాట్లాడుతూ ”న్యాయం కోసం మా పోరాటంలో మాకు మద్దతు ఇవ్వగల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ వాలంటీర్లు మాకు అవసరం. మీరు మాకు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి కలిగి ఉంటే దయచేసి సంప్రదించండి” అని అన్నారు.

 

Spread the love