ఆందోళనకరం

Worrying– పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను తీవ్రంగా పరిగణించాలి
– సమాజాన్ని పీడిస్తూ లోతుగా పాతుకుపోయిన సమస్య ఇది : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో, కార్యాలయాల్లో ఏ రూపంలోనైనా లైంగిక వేధింపులు ఆందోళనకరమనీ, దీనిని తీవ్రంగా పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. లైంగికవేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) మాజీ ఉద్యోగికి పెన్షన్‌లో 50 శాతం కోత పెట్టాలన్న ఉత్తర్వులను రద్దుచేస్తూ గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ‘ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద తప్పిదం. దాన్ని కొట్టేస్తున్నాం. పని ప్రదేశంలో లైంగిక వేధింపులను తీవ్రంగా పరిగణించాలి. అలాంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తిని చట్టం నుంచి తప్పించుకోవడానికి అనుమతించకూడదు. అతడికి తగిన శిక్ష పడకపోయినా, తక్కువ శిక్షతో తప్పించుకున్నా.. బాధితురాలికి తీవ్ర అవమానం జరిగినట్టే’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘లైంగిక వేధింపులు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాలను పీడిస్తున్న ఒక విస్తృతమైన, లోతుగా పాతుకుపోయిన సమస్య. భారతదేశంలో, ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం’ అని ధర్మాసనం పేర్కొంది. అసోంలోని రంగియాలో సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) సంస్థలో ఏరియా ఆర్గనైజర్‌గా పనిచేసిన దిలీప్‌ పాల్‌ అనే అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళా ఉద్యోగి ఆరోపించింది. దీనిపై ఉన్నతస్థాయిలో విచారణ జరిగింది. నిందితుడికి నెలనెలా వచ్చే పెన్షన్‌లో 50శాతం కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాల్‌ చేస్తూ దిలీప్‌.. గువహతి హైకోర్టును ఆశ్రయించాడు. పెన్షన్‌లో కోత పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ హైకోర్టు 2019లో తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో కేంద్రం అపీలు చేసింది.

 

Spread the love