ఐదు అంతస్తుల భవనంలో మంటలు
– 73 మంది సజీవదహనం
– 52 మందికి గాయాలు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో దారుణం జరిగింది. జొహన్నెస్‌బర్గ్ నగరంలో ఒక ఐదు అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగి 73 మంది సజీవదహనమయ్యారు. అనేక మందికి తీవ్రగాయలయ్యాయి. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినా భవనమంతా దట్టమైన పొగ అలుముకొని ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు. అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. వలస వచ్చిన వారు, నిరాశ్రయులు ఎలాంటి లీజ్ అగ్రిమెంట్లు లేకుండానే ఈ భవనంలో నివాసముంటున్నారని. అందువల్ల భవనంలో చిక్కుకుపోయిన వారిని వెతకడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఈ భవనంలో సుమారు 200 మంది నివాసముంటున్నట్లు స్థానికులు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికా రులు అంచనా వేస్తున్నారు. మంటల ధాటికి భవనం చాలా వరకు ధ్వంసమైంది. జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రముఖ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్‌లో ఈ భవనం ఉంది. జొహన్నెస్‌బర్గ్‌లో చాలా ప్రాంతాల్లో అనేక భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఇందులో చాలా భవనాలు వరకు క్రిమినల్ సిండికేట్ల అధీనంలో ఉంటాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు అక్రమంగా ఈ భవనాలు అద్దెకు ఇస్తారు. గురువారం ప్రమాదం జరిగిన భవనంలోనూ అలాంటి శరణార్థులే ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇలాంటి భవనాలకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసినా శరణార్థులు అక్కడే ఉంటున్నారని అధికారులు చెప్పారు.