– సదర్‌ను రాష్ట్రపండుగగా గుర్తించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు
– అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ అధ్యక్షులు రవీంద్రనాథ్ యాదవ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంలో యాదవుల పాత్ర కీలకమనీ, వారికి మంత్రి, ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ అధ్యక్షులు రవీంద్రనాథ్‌యాదవ్ డిమాండ్ చేశారు. సదర్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జైపూర్‌లో జరిగిన అఖిల భారత యాదవ మహాసభలో ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు సీట్లిచ్చే విషయంలో ప్రాధాన్యతనివ్వాలని కోరారు. తనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు జాతీయ అధ్యక్షులు స్వపన్ కుమార్ ఘోష్, కార్యనిర్వహక అధ్యక్షులు, మాజీ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్, జాతీయ కార్యనిర్వహక అధ్యక్షులు ఎస్ సోం ప్రకాష్ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులు సత్య ప్రకాష్ సింగ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి, దక్షిణ భారత ఇన్‌చార్జి లక్ష్మణ్ యాదవ్, నియామక పత్రాన్ని విడుదల చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి బల్బీర్ సింగ్ యాదవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి చింతల లక్ష్మణ్‌యాదవ్ సేవలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తానని చెప్పారు. దశాబ్ద కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన జాతీయ సంరక్షకులు బద్దుల బాబురావు యాదవ్ వంటి అనుభవజ్ఞులతో పనిచేయడం ఎంతో ఉత్సాహాన్ని నింపిందని గుర్తుచేశారు. త్వరలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నూతన కమిటీలు వేస్తామని తెలిపారు.