రాజ్‌ఘాట్‌లోకి యమునా వరద నీరు

న్యూఢిల్లీ : దేశరాజధాని నగరం న్యూఢిల్లీలో యమునా వరద ఉధృతి కొనసాగుతూనేవుంది. రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారకంలోకి వరద నీరు ప్రవేశించింది. అక్కడి పచ్చిక బయళ్లను ముంచెత్తింది. రాజ్‌ఘాట్‌లోకి వరదనీరు ప్రవేశించిన చిత్రాలను గాంధీ స్మృతి అండ్‌ దర్శన్‌ సమితి వైస్‌ చైర్మన్‌ విజరు గోయల్‌ ట్వీట్‌ చేశారు. రింగ్‌ రోడ్డును దాటుకుంటూ వచ్చిన వరద నీరు అక్కడ నుంచి రాజ్‌ఘాట్‌లోకి చేరుకున్నాయి. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విలేకరులతో మాట్లాడుతూ ఆ ప్రాంతంలోని డ్రెయిన్‌ నుంచి బ్యాక్‌ఫ్లో కారణంగా రాజ్‌ఘాట్‌లోకి వరద నీరు ప్రవేశించిందని చెప్పారు. ఢిల్లీలోని యమునా నది పశ్చిమ ఒడ్డున రాజ్‌ఘాట్‌ 44.35 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1948లో మహాత్మా గాంధీ అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే ఆయన స్మారకాన్ని నిర్మించారు.
వరద నీటిలో మునిగి ముగ్గురు బాలురు మృతి
ఢిల్లీలోని యమునా నది వరద నీటిలో మునిగి ముగ్గురు బాలురు మృతి చెందారు. ముకుంద్‌పూర్‌ చౌక్‌ ప్రాంతంలో శుక్రవారం మధ్నాహ్నం ఈ దారుణం జరిగింది. మెట్రో నిర్మాణ స్థలంలో చేరుకున్న వరద నీటిలో స్నానం చేయడానికి దిగిన ఈ బాలురు ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. మృతుల్ని ఈశాన్య ఢిల్లీకి చెందిన నిఖిల్‌ (10), పియూష్‌ (13), ఆశీష్‌ (13)గా గుర్తించారు.

Spread the love