– ఫిబ్రవరి నాటికి మరింత పెరిగే అవకాశం
– జొన్న, మక్కలు మినహా తగ్గుతున్న ఆహార పంటలు
– వేరుశనగ సాధారణం
– రాగి, సజ్జ, కొర్ర నామ మాత్రమే
– గోధుమలు 35శాతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగి సీజన్‌లో వరి పంట సింహభాగం కానుంది. మొత్తం సాగు విస్తీర్ణంలో వరి సాగు ఇప్పటివరకు 36.21 లక్షల ఎకరాలకు చేరింది. గతేడాది ఇదే సమయానికి 30 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది ఆరు లక్షల ఎకరాల్లో ఎక్కువగా పంట సాగు చేశారు. ఫిబ్రవరి 20 నాటికి మరింత పెరిగే అవకాశం ఉన్నది. గతంతో పోల్చితే ఈ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో భారీ వానలు పడ్డాయి. దీంతో చెరువులు, కుంటల్లో నీరు చేరింది. భూగర్భ జలాలు కూడా అధికమయ్యాయి. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నది. దీంతో రైతులు అధికంగా వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. గతేడాది వరి సాగు 75శాతం కాగా, ప్రస్తుతానికి 77 శాతమైంది. 85శాతానికి చేరే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ వరి సాగు పెరగడంతో ఇతర ఆహార పంటలు తగ్గుముఖం పడుతున్నాయి. మొక్కజొన్న పంట సాగు గతంతో పోల్చితే ఈసారి 78వేల ఎకరాలకు పెరిగింది. ఈ పంటకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నది. ఆహార పంటల్లో ముఖ్యమైన జొన్నపంట పట్ల రైతులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో జొన్న వినియోగం కూడా బాగా పెరిగింది. క్వింటా ధర కూడా రూ. 6వేలు పలుకుతుంది. దీంతో వానాకాలంతోపాటు యాసంగి పంటగా సాగు చేస్తున్నారు. నీటి వసతి ఉన్న రైతులు జొన్న పంటను వేస్తున్నారు. రాగి, కొర్ర పంటల సాగు నామమాత్రంగా ఉంటున్నది. ముఖ్యంగా రాగి గతేడాది ఈ సమయానికి 137 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి కేవలం 73 ఎకరాల్లో మాత్రమే సాగైంది. కొర్ర పంట గత యాసంగిలో 259 ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది వంద ఎకరాల్లో మాత్రం రైతులు సాగు చేస్తున్నారు. సజ్జ పంట వానాకాలంలో వర్షాధార పంటగా ఎక్కువగా సాగు చేస్తారు. యాసంగి సీజన్‌లో సజ్జ పంట 62 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. జొన్న, మొక్కజొన్న, రాగి, కొర్ర, సజ్జ వంటి ఆహార పంటల కంటే నిత్యం వినియోగించే గోధుమ పంట కూడా రైతులు సాగు చేయడం లేదు. గత యాసంగిలో ఈ సమయానికి 6,785 ఎకరాల్లో సాగు చేస్తే…ఈసారి 4,130 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గోధుమ పంటకు అనుకూలమైన నేలలు ఉన్నప్పటికీ రైతులు అధికంగా వరి సాగుపైన్నే దృష్టిసారిస్తున్నారు. పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు సాధారణంగానే ఉన్నవి. అయితే గతేడాదితో పోల్చితే ఈసారి వేరుశనగ పంట సాగు పెరిగింది. కానీ పొద్దుతిరుగుడు పంటసాగు తగ్గింది. కందులు, ఉలవలు, శనగ, పెసర పంటల సాగు కూడా ఆశాజనకంగా లేదు. మొత్తంగా వరి సాగు విస్తీర్ణం పెరగడంతో ఆహార, నూనె గింజల సాగు విస్తీర్ణం తగ్గుతున్నది. పండ్లు, కూరగాయల సాగు పెరగడం లేదు. యాసంగి సీజన్ ఆహార పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే పండ్లు, కూరగాయలు, ఆహార పంటలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో మరింత దిగుమతులు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.