– సంతాప సభలో వక్తలు
– అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ కీలకపాత్ర
అమరావతి : దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని నిలబెట్టడంలోనూ, నేడు విజృంభిస్తున్న మతోన్మాదాన్ని అడ్డుకోవడంలోనూ సీతారాం ఏచూరి అలుపెరుగని పోరాటం చేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపసభ ఆదివారం ఉదయం విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. దీనికి తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ, వీసీకేలతోపాటు అన్ని వామపక్ష పార్టీల నాయకులూ హాజరయ్యారు. తొలుత వక్తలను సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు వేదికపైకి ఆహ్వానించగా, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సభాధ్యక్షత వహించారు. తొలుత పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, మంత్రి కొలుసు పార్థసారథి.. ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సంతాప సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించారు. ప్రజాశక్తి ప్రచురించిన ప్రత్యేక సంచికను బి.వి.రాఘవులు ఆవిష్కరించారు. కొండూరు వీరయ్య రూపొందించిన సీతారాం ఏచూరి పుస్తకాన్ని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్ ఆవిష్కరించారు.
ఏచూరి బహుముఖ ప్రజ్ఞాశాలి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి}
ఏచూరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చిన్న వయసులోనే కేంద్ర నాయకత్వంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి తెలిపారు. మార్క్సిజం, లెనినిజం యొక్క విశిష్టతను ఆయన తెలియజేశారని పేర్కొన్నారు. ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేయడానికి ఇండియా బ్లాక్ ఏర్పాటు చేయడంలో అన్ని పార్టీల వ్యక్తిగత అభిప్రాయాలను స్వీకరిస్తూనే ఏచూరి నిర్వహించిన పాత్రను మర్చిపోలేమని పేర్కొన్నారు. ఏచూరికి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంతోనూ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఎప్పుడు అంతర్జాతీయ సమావేశాలకు వెళ్లినా ఏచూరి గురించి అడిగేవారని తెలిపారు. నాలుగున్నర దశాబ్దాల పాటు విద్యార్థి ఉద్యమం నుంచి తాము కలిసి పనిచేశామని అన్నారు. ఆయన ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ పార్టీ అగ్రనేతలు ఇఎంఎస్ నంబూద్రిపాద్, సూర్జిత్, సుందరయ్య, మాకినేని బవసపున్నయ్య నాయకత్వంలో అభివృద్ధి చెందారని పేర్కొన్నారు. పార్టీ యువతను ప్రమోట్ చేయడానికి సిద్ధమైన సమయంలో 1992 పద్నాలుగో మహాసభలో సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టులు దెబ్బతిన్న సమయంలో సోషలిజం అజేయం, శాశ్వతం అని దాని అమల్లో లోపాల వల్లే దెబ్బతిందనే తీర్మానాన్ని ఏచూరి ప్రవేశపెట్టారని తెలిపారు. దాన్ని మాకినేని బసవపున్నయ్య ప్రవేశపెట్టాల్సి ఉందని, సైద్ధాంతిక పరిపక్వతను దృష్టిలో పెట్టుకుని ఏచూరితో పెట్టించారని పేర్కొన్నారు.
పేదల కోసం అహర్నిశలూ పనిచేశారు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి, టీడీపీ నాయకులు కొలుసు పార్థసారథి
పేదల కోసం అహర్నిశలూ పోరాడిన వ్యక్తి మరణం బాధాకరమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి, తెలుగుదేశం నాయకులు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. తెలుగు వ్యక్తిగా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. జెఎన్‌యులో కమ్యూనిజాన్ని బలోపేతం చేయడంతోపాటు ప్రజాస్వామ్య విలువల కోసం పనిచేశారని తెలిపారు. ఇందిరాగాంధీ అంటేనే భయపడుతున్న సమయంలో ఆమె పక్కన నిలబడి యూనివర్సిటీలో ఛాన్సలర్‌గా పదవికి రాజీనామా చేయాలని కోరిన ధీరుడని తెలిపారు. ఎక్కడున్నా తెలుగు ప్రజలకు, తెలుగు నేలకు ఆత్మబంధువుగా ఉన్నారని వివరించారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైన సమయంలోనూ పార్లమెంటులోనూ, అవకాశం వచ్చిన అన్నిచోట్ల ఆయన గళాన్ని బలంగా వినిపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ఆపద ముంచుకొచ్చినా ముందుండి పోరాడారని వివరించారు. ఎన్‌టీఆర్‌ను గద్దెదించిన సమయంలో శాసనసభ్యులందరూ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఏచూరి చేసిన కృషి మరిచిపోలేమని తెలిపారు. ఆయన జీవితం మొత్తం దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడారని వివరించారు. పెట్టుబడుల ఉపసంహరణకు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. స్టీలు ప్లాంటును కాపాడుకునేందుకు మూడేండ్లుగా కృషి చేస్తున్నారని వివరించారు. ఆయనకు అధికారం ముఖ్యం కాదని, ఈ తరం రాజకీయ నాయకులకు ఆయన జీవితం పాఠంగా ఉండాలని పేర్కొన్నారు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న సమయంలో దేశ సార్వభౌమత్వానికి ఈ ఒప్పందం ముప్పుగా పరిణమిస్తుందని బలంగా వ్యతిరేకించారని తెలిపారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులోనూ సీతారాం ఏచూరి ముఖ్య కారకులని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలోనూ, రాష్ట్రాల హక్కుల విషయంలో ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ఈ సమయంలో ఆయనను కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మరణం దోపిడీదారులకు భయంలేని పరిస్థితులను కల్పిస్తోందని వివరించారు.
భారత రాజకీయాల్లో తీరని లోటు
వైసీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
వైసీపీ నాయకులు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న శక్తిగా దేశవ్యాప్తంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ భావించే పార్టీలో నిబద్ధతగా విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర వహించే స్థాయికి ఏచూరి ఎదిగారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, భారత రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. పార్లమెంటులో ఏచూరి ప్రవేశపెట్టిన సవరణలు, ఉపన్యాసాల తరువాత పార్లమెంటు ప్రభావితం అయిన అంశాలను గుర్తుచేసుకుంటే ఒక మంచి పార్లమెంటేరియన్‌గా ఆయన విశేషమైన సేవలు అందించారని అన్నారు.
ఏచూరి మరణం దేశానికి నష్టం
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమంతోపాటు, దేశానికి కూడా నష్టమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పేర్కొన్నారు. విప్లవకారుడు, కమ్యూనిస్టు దేశంలో సిపిఎంను అభివృద్ధి చేసి నిర్మించే కర్తవ్యంలో ముఖ్యపాత్ర వహించారని తెలిపారు. దేశంలో బీజేపీకి మెజార్టీ తగ్గినా ఎజెండాలోని ముఖ్యమైన అంశాలను ఆ పార్టీ కొనసాగిస్తోందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం కోసం అన్ని రాజకీయపక్షాలను ఒకతాటిపైకి తేవడంలో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన సమయంలో సీతారాంతోపాటు పలువురిని జైల్లో పెట్టారని అన్నారు. అనంతరం జెఎన్‌యు ఛాన్సలర్ పదవికి ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని ఆమె ముందే నిలుచుని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. హిట్లర్ చెప్పిన విధంగా ఒకే దేశం, ఒకే ఎన్నిక పేరుతో మోడీ ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. మతాలు, భాషలు, కులాలు కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నిక ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. దీనివల్ల ఖర్చు కూడా తగ్గదన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి లేకుండా చేసే పని చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్‌టిఆర్‌ను దించేసిన సమయంలో ప్రజలు నిలబడి ఆయనను మరలా తెచ్చుకున్నారని, ఒకే దేశం ఒకే ఎన్నిక వస్తే ఆ అవకాశం వుండదన్నారు. ఈ విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన సందర్భమని, అటువంటి వారిని కలిపి ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లడంలో సీతారాం దిట్టని పేర్కొన్నారు. ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదం ఉండాలని బలంగా నమ్మారని వివరించారు. మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదని అన్నారు. తిరుమల లడ్డూ తయారీ కలుషితం అయిందన్న విషయాన్ని అందరూ ఖండిస్తున్నారని, కారకులను శిక్షించొచ్చని, కానీ రాజకీయం చేయకూడదని తెలిపారు. దీంతోపాటు అన్ని పదార్థాల్లోనూ కల్తీ జరుగుతుండొచ్చని, వాటినీ నిలువరించాలని కోరారు. దేవుడి సొమ్మును దోచుకునే వారిని వదిలేస్తూ పవిత్రతను ప్రస్తావించడం సరికాదని అన్నారు.