ప్రజాస్వామ్య రక్షకుడు ఏచూరి

Yechury is the savior of democracy– జేఎన్‌యూ యుద్ధభూమిలో ఆయనను స్మరించుకున్న మేథావులు
– ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రల ఛేదనే ఏచూరికి మనమిచ్చే ఘన నివాళి : ప్రకాశ్‌కరత్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి సంరక్షకుడిగా జేఎన్‌యూ యుద్ధ భూమిలో ఎదిగిన సీతారాం ఏచూరితో అనుభవాలను, జ్ఞాపకాలను జేఎన్‌యూ కామ్రేడ్స్‌ పంచుకున్నారు. శనివారం నాడిక్కడ స్థానిక ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ)లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభ ”సెలబ్రేటింగ్‌ సీత…రిమెంబరింగ్‌ సీత”లో జెఎన్‌యూ విద్యార్థి సంఘం తొలితరం నాయకులు సీతారాం ఏచూరిని స్మరించుకున్నారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం తొలి అధ్యక్షుడిగా పనిచేసిన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కరత్‌ తొలుత తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ”సీతారాం ఏచూరి 1973లో జేఎన్‌యూలో ఎంఎ ఎకనామిక్స్‌లో చేరారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా నేను పోటీ చేయగా సీతారాం ప్రచారం చేశారు. దాంతో ఏచూరి రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యారు” మేము 74 నుంచి కలిసి పనిచేయడం ప్రారంభించామని ప్రకాశ్‌కరత్‌ తెలిపారు. ఎమర్జెన్సీ తరువాత, యూనియన్‌ అధ్యక్షుడైన సీతారాం, ఎమర్జెన్సీకి ముందు ఉన్న జేఎన్‌యూని పునర్నిర్మించడానికి గట్టి ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఛాన్సలర్‌ ఇందిరాగాంధీపై పెట్టిన చార్జిషీట్‌ను ఆయన ఆమె ముందు చదివి వినిపించడంతో ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని తెలిపారు.
దశాబ్దాల తరువాత మోడీ ప్రభుత్వం ఏర్పాటైన రెండో వార్షికోత్సవం సందర్భంగా జేఎన్‌యూపై దాడి జరిగినప్పుడు మళ్లీ సీతారాం తెరపైకి వచ్చారని గుర్తు చేశారు. హిందుత్వ రాష్ట్ర ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అమలు చేయాలన్న ఉద్యమానికి జేఎన్‌యూ పెను సవాల్‌ అని, దానిని ధ్వంసం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీతారాం ఎత్తిచూపారని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగాన్ని పరిరక్షించే పోరాటంలో ఎప్పుడూ ముందుండే జేఎన్‌యూపై జరుగుతున్న దాడులను ఛేదించడమే సీతారా ఏచూరికి ఇచ్చిన ఘనమైన నివాళి అని అన్నారు. జేఎన్‌యూ ఎస్‌యూ మాజీ అధ్యక్షులు డి.రఘునందన్‌, జగదీశ్వర్‌ చతుర్వేది, రష్మీ దొరైస్వామి, టికెఅరుణ్‌, నళినీ రంజన్‌ మొహంతి, అమిత్‌సేన్‌ గుప్తా, సూరజిత్‌ మజుందార్‌ తదితరులు మాట్లాడారు. సోహైల్‌ హష్మీ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

Spread the love