ఎయిమ్స్‌కు ఏచూరి భౌతికకాయం

నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత కమ్యూనిస్టు లోకానికి తీరని లోటు అనే చెప్పవచ్చు. వామపక్ష విద్యార్థి ఉద్యమ నేతగా మార్కిస్టు భావాలను అలవరచుకున్న ఆయన.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లో నిమగ్నమయ్యారు. భారత విప్లవ రాజకీయాల్లో ఆయనోక స్థితప్రజ్ఞుడు. నిత్యం ప్రజాసమస్యలపై గళమెత్తే ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు. మరణించిన తర్వాత కూడా ఆయన దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం దానం చేస్తున్నట్టు ఆయన కుటుంబీకులు ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్‌కు సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా మరణాంతరం శరీరాన్ని వైద్య సేవలకే అప్పగించారు. 2010లో జ్యోతిబసు మరణించగా.. ఆయన దేహాన్ని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి దానం చేశారు. సుదీర్ఘ కాలంపాటు వామపక్ష పార్టీలో కొనసాగిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ సైతం తన శరీరాన్ని దానం చేస్తానని 2000లో ప్రతిజ్ఞ చేశారు. 2018లో ఆయన మరణించగా.. ఆయన కుటుంబీకులు శరీరాన్ని దానం చేశారు. సీపీఐ(ఎం) కార్యదర్శి అనిల్‌ బిశ్వాస్‌తోపాటు పార్టీ సీనియర్‌ నేత బెనోయ్‌ చౌధురీల భౌతికకాయాలూ ఆస్పత్రులకు అప్పగించారు.
మరణానంతరం భౌతిక దేహాలను పరిశోధనల కోసం వైద్యకళాశాలకు అందజేస్తున్నారు. ఆగస్టు మరణించిన పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) అగ్రనేత బుద్ధదేవ్‌ భట్టాచార్య (80) భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. కోల్‌కతాలోని నీల్‌ రతన్‌ సిర్కార్‌ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి భౌతికదేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి మార్చి 2006లోనే బుద్ధదేవ్‌ ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు.

Spread the love