ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఆమె రాజీనామాకు డిమాండ్ చేసిన ఏచూరి

నవతెలంగాణ హైదరాబాద్: దేశ రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరా గాంధీ పక్కన నిలబడి జేఎన్‌యూ ఛాన్స్‌లర్‌గా ఆమె రాజీనామాను డిమాండ్ చేయాలంటే ఏంత ధైర్యం కావాలి. అది కూడా నూనూగు మీసాల వయసు ఉన్న యువకుడు దేశ ప్రధాని పక్కన నిలబడి ఆమె రాజీనామా డిమాండ్  చేయడమంటే నిజంగా ఆది సాహసమే. ఆ విద్యార్థి నేతే నేడు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిలిచిన సీతారాం ఏచూరి. ఎమర్జెన్సీ తర్వాత జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన సీతారాం ఏచూరి.. వర్సిటీపై తనదైన ముద్ర వేశారు. వామపక్ష భావజాలం వ్యాప్తికి విశేషమైన కృషి చేశారు. ఈనాటికీ జేఎన్‌యూపై ఎస్‌ఎఫ్‌ఐ పట్టు కొనసాగుతోందంటే అప్పట్లో ప్రకాశ్‌ కరాత్ తో కలిసి ఏచూరి  వేసిన పునాదులే కారణం. ఎమర్జెన్సీ తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో ప్రధాని పదవి కోల్పోయిన ఇందిర.. జేఎన్‌యూ ఛాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో 1977 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏచూరి నేతృత్వంలోని విద్యార్థులు నేరుగా ఆమె నివాసం వద్దకు చేరి డిమాండ్‌ చేయడంతో కొన్నాళ్ల తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఇదే విషయాన్ని పంచుకుంటూ పాత చిత్రాన్ని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఏచూరి కన్నుమూసిన వేళ.. ఈ ఘటనకు సంబంధించిన చిత్రం ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Spread the love