– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం దేశ ప్రజలకు నష్టమనీ, వామపక్ష, కార్మిక ఉద్యమాలకు తీరని లోటు అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళి అర్పించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ అధ్యక్షతన జరిగిన ఈ సంతాప కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శి జె. చంద్రశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్, యాటల సోమన్న, ఎ.సునీత, కెవివిఎస్‌ఎన్ రాజు, సోషల్ మీడియా నాయకులు భానుకిరణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగిన అనేక ఉద్యమాలలో, దేశవ్యాప్త సమ్మెల సందర్భంగా ఏచూరి ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమాలకు అండదండగా నిలిచారని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశారనీ, బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వ మతోన్మాద విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సైద్ధాంతిక పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాల్లో కూడా ప్రత్యక్ష అనుబంధం కల్గిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. భూపాల్ మాట్లాడుతూ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సోషలిజం కోసం పోరాడిన యోధుడు ఏచూరి అని చెప్పారు. అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో గళమెత్తి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా సేవలందించారని కొనియాడారు. దేశంలోని కమ్యూనిస్టులు, వామపక్షాలు, సామాజిక శక్తులు కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలని ఆశించారన్నారు. జమ్మూ-కాశ్మీర్‌ను నిర్భంధ జైలుగా మార్చిన బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి జమ్మూ-కాశ్మీర్‌ను సందర్శించిన మొదటి వ్యక్తిగా నిలిచారని తెలిపారు. యూపీఏ-1 ప్రభుత్వ కాలంలో ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం సాధించారనీ, దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం కృషి చేశారని కొనియాడారు. అలాంటి నాయకుడ్ని కోల్పోవడం భారత ప్రజలకే తీవ్ర నష్టమన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.