ఔను నిజమే…

ఔను నిజమే...– బ్యాలెట్లను దిద్దినట్లు అంగీకరించిన ప్రిసైడింగ్‌ అధికారి!
– ప్రాసిక్యూట్‌ చేయాలన్న సుప్రీం
– చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై ప్రిసైడింగ్‌ అధికారిని విచారించిన బెంచ్‌ ొ నేడు మళ్లీ విచారణ
చండీగఢ్‌ : బీజేపీ మేయర్‌ మనోజ్‌ సోన్‌కర్‌ విజయం సాధించేందుకు మార్గం సుగమం చేసేలా బ్యాలట్‌ పత్రాలపై క్రాస్‌ మార్క్‌ పెట్టినట్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి అనీల్‌ మసి అంగీకరించారు. గత నెల్లో జరిగిన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ పునరుద్ధరించింది. ఈ సందర్భంగా ప్రిసైడింగ్‌ అధికారి 8 బ్యాలెట్‌ పత్రాలపై క్రాస్‌ మార్క్‌ వేసి, అనంతరం వాటిని చెల్లని ఓట్లుగా ప్రకటించారు. అయితే ఓటింగ్‌ ప్రక్రియ సందర్భంగా కౌన్సిలర్లు దిద్దిన బ్యాలట్‌ పత్రాలపైనే తాను క్రాస్‌ మార్క్‌ పెట్టినట్లు చెబుతూ ఆ అధికారి తన చర్యను సమర్ధించుకున్నారు. ఆ పత్రాలు మిగిలిన వాటితో కలిసి పోకుండా చూసేందుకే తాను అలా గుర్తు పెట్టినట్లు తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ స్పందిస్తూ, బ్యాలెట్‌ పత్రాలపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాల్సివుంటుంది. మీరు ఇతరత్రా మార్కులు కూడా పెట్టవచ్చని నిబంధనల్లో ఎక్కడైనా వుందా? అని ఆయన ప్రశ్నించారు. అనంతరం సొలిసిటర్‌ జనరల్‌నుద్దేశించి మాట్లాడుతూ, ‘ఎన్నికల క్రమంలో జోక్యం చేసుకున్నందున ఆయనను ప్రాసిక్యూట్‌ చేయాల్సి వుంది.’ అని పేర్కొన్నారు. బ్యాలెట్లను మంగళవారం బెంచ్‌ పరిశీలిస్తుందని చంద్రచూడ్‌ చెప్పారు. పంజాబ్‌, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కస్టడీలో వుంచిన అన్ని బ్యాలెట్‌ పత్రాలను, వీడియో రికార్డింగ్‌లను మంగళవారం మధ్యాహ్నం 2గంటల కల్లా సుప్రీం ముందు హాజరుపరచాల్సిందిగా ఆదేశించారు. జ్యుడీషియల్‌ అధికారిని నియమించాల్సిందిగా పంజాబ్‌, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను కోర్టు కోరింది. ఆయనకు భద్రత కల్పించాల్సిందిగా ఆదేశించింది. నామినేట్‌ చేసిన జ్యుడీషియల్‌ అధికారిని సురక్షితంగా తీసుకువెళ్ళేలా, అలాగే బ్యాలెట్‌ పత్రాలను భద్రంగా వుంచేలా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా బెంచ్‌ ఆదేశించింది. మంగళవారం నాటి విచారణకు రావాల్సిందిగా ప్రిసైడింగ్‌ అధికారిని బెంచ్‌ ఆదేశించింది. ఇలాంటి బేరసారాలు చోటు చేసుకోవడంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు బెంచ్‌ పేర్కొంది. రిగ్గింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఆదివారం బిజెపి మేయర్‌ రాజీనామా చేశారు.
కాగా ఒకవేళ రీపోలింగ్‌కు ఆదేశించిన పక్షంలో ఆ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ముగ్గురు ఆప్‌ కౌన్సిలర్లు పార్టీలో చేరారు. దీనిపై ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రివాల్‌ స్పందిస్తూ, సోన్‌కర్‌ రాజీనామాతో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రుజువైందన్నారు. బీజేపీ ఎన్నికల్లో గెలవలేనపుడు, మా కౌన్సిలర్లను కొనుగోలు చేసి, చీలుస్తున్నారని కేజ్రివాల్‌ విమర్శించారు. అంతకుముందు ఆప్‌ పంజాబ్‌ ప్రతినిధి మల్విందర్‌ సింగ్‌ కాంగ్‌ మాట్లాడుతూ, బీజేపీ చేసిన తప్పులు కెమెరాలో పట్టుబడ్డాయని, సుప్రీం కోర్టు వాటిని గమనించిందని అన్నారు.ఇప్పుడు ఆప్‌ కౌన్సిలర్లకు రాత్రికి రాత్రే గాలం వేసిన బీజేపీ ఆపరేషన్‌ లోటస్‌ను అమలు చేసిందని విమర్శించారు. భారత ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా పెద్ద అపహాస్యం వుండదని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం పట్ల బీజేపీకి గల దాహాన్ని, ఆశను యావత్‌ ప్రపంచం చూస్తోందని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ విమర్శించారు.

Spread the love