– లైంగికదాడి కేసులో ఆశారాంకు బెయిల్
– రాజస్థాన్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు
జైపూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాంకు మరొకసారి ఊరట లభించింది. 2013 లైంగికదాడి కేసులో రాజస్థాన్ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. మార్చి 31 వరకు ఆయన బెయిల్‌పై బయటే ఉండనున్నారు. ఈ మేరకు న్యాయస్థానం కొన్ని ఆంక్షలు విధించింది. ఆరోగ్యకారణాల రీత్యా, ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం ఆయనకు మార్చి 31 వరకు బెయిల్ మంజూరు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే రాజస్థాన్ హైకోర్టు నుంచి కూడా ఆశారాంకు బెయిల్ రావటం గమనార్హం. 2013లో జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో బాలికపై లైంగికదాడి చేశాడన్న ఆరోపణలపై ఆయన జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. దిగువ కోర్టు 2018 ఏప్రిల్‌లో ఆశారాంకు జీవిత ఖైదు విధించిన విషయం విదితమే. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేయటంతో బాధితురాలి తండ్రి ఇప్పటికే తన కుటుంబ రక్షణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆశారాంకు రాజస్థాన్ హైకోర్టు నుంచి కూడా బెయిల్ రావటం గమనార్హం. కాగా, బాధితురాలు, వారి కుటుంబంతో మాట్లాడామనీ, భద్రతను ఏర్పాటు చేశామని యూపీ పోలీసులు చెప్తున్నా.. బాధిత కుటుంబంలో మాత్రం భయం అలాగే ఉన్నది.