కార్మికులపై యోగి సర్కారు ఉక్కుపాదం

Yogi government's iron foot on workers– డిమాండ్ల సాధన కోసం 112 హెల్ప్‌లైన్‌ కార్మికుల ఆందోళన
– విరుచుకుపడ్డ యూపీ పోలీసులు
లక్నో: యూపీలోని యోగి సర్కారు కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. డిమాండ్ల సాధన కోసం నిరసన చేస్తున్న 112 హెల్ప్‌లైన్‌ కార్మికులను అణచివేస్తున్నది. వారిపై పోలీసులను ఉసిగొల్పింది. దీంతో నిరసన చేస్తున్న కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. యూపీలోని డయల్‌ 112లో కమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌ అయిన గీత.. ఆత్మహత్య, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, రోడ్డు పక్కన సహాయానికి సంబంధించిన దాదాపు 500 రోజువారీ కాల్‌లకు హాజరవుతుంది. పండుగ సీజన్‌లో కాల్‌ల సంఖ్య రోజుకు 700-800కి చేరుకుంటుంది. అయితే, ఇంత పని ఒత్తిడిలో ఉన్న తమకు అవసరానికి సెలవులు కూడా నిరాకరించబడుతున్నాయని గీత లాంటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గీత గత ఆరేండ్లుగా యూపీ ప్రభుత్వంలో కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేసి డజన్ల కొద్దీ ప్రాణాలను కాపాడింది. తమకు జీతాలు తక్కువేననీ, జీతాలను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ”మాకు నెలకు రూ. 11,800 లభిస్తున్నది. గత ఏడేండ్లుగా మా జీతం పెరగలేదు. మేము 365 రోజులు పని చేయవలసి వచ్చింది. మేం బందిపోటు కార్మికులమా? రోజువారీ కూలీ కూడా నెలకు రూ.15,000 నుంచి 20,000 సంపాదిస్తున్నాడు. మేము అవిశ్రాంతంగా పని చేయాలని భావిస్తున్నాము. అది కూడా తక్కువ జీతాలతో” అని గీత అన్నారు. కనీస వేతనాలతో కుటుంబాన్ని పోషించుకోలేక సొంత ఖర్చులు భరించలేక పోతున్నామని ఆమె అన్నారు. ప్రస్తుతమున్న రూ.11,800 నుంచి రూ.18,000 పెంచాలనీ, వారానికోసారి సెలవులు, నెలకు రెండు వేతనంతో కూడిన సెలవులు, గ్రాట్యుటీ, ప్రావిడెంట్‌ ఫండ్‌తో కూడిన అన్ని ప్రయోజనాలతో ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ”మేము ఆదివారం నుంచి సమ్మె చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మాతో మాట్లాడటానికి కూడా పట్టించుకోలేదు” అని నిరసన తెలుపుతున్న మహిళలు అన్నారు. ప్రభుత్వం తమకు మెరుగైన జీతాలు, సౌకర్యాలు కల్పిస్తే తప్ప పని చేయలేమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్యను పరిష్కరించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలవాలని డిమాండ్‌ చేయడంతో కొందరు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత, పోలీసులు ‘బలవంతంగా’ నిరసనను సుశాంత్‌ గోల్ఫ్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అర్జుగన్‌ నుంచి ఎకో గార్డెన్‌కు మార్చారు. ”మమ్మల్ని మగ, ఆడ పోలీసులు కొట్టారు. కనికరం లేకుండా లాగారు. మేము నిరసనను విరమిస్తాము అనుకుంటే వారు పొరబడినట్టే ”అని నిరసనకారులు అన్నారు. 2019లో సీఎం ఆదిత్యనాథ్‌ యూపీలో 112లో ఇంటిగ్రేటెడ్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ను ప్రారంభించారు. పలు నంబర్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని తొలగించ డానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ (ఈఆర్‌ఎస్‌ఎస్‌) కింద పోలీసు, అగ్నిమాపక దళం, అంబులెన్స్‌, ఇతర సేవలను పొందటం కోసం ఇది అన్నింటినీ కలుపుకొని ఉన్న అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్‌. ఈ సంఖ్య భారతదేశం అంతటా పని చేస్తుంది. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎంను కలవక ముందే రాత్రంతా చలిలో కూర్చొని డిమాండ్లు చేస్తున్న నిరసనకారులను ఉదయం అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.

Spread the love