దిగొచ్చిన యోగి సర్కారుొ కానిస్టేబుల్‌ పరీక్ష రద్దు

Yogi Sarkaro constable exam canceled– ఇది విద్యార్థులు, యువత విజయం : రాహుల్‌
లక్నో : యూపీలోని యోగి సర్కారు దిగొచ్చింది. పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ కేసులో అభ్యర్థుల ధర్నాతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానిస్టేబుల్‌ పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈనెల 17, 18 తేదీలలో యూపీలో పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్ష జరిగింది. 60,244 పోలీసు కానిస్టేబుల్‌ పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 75 జిల్లాల్లోని 2370 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. అయితే, ప్రశ్నపత్రం లీకైందనీ వందలాది మంది అభ్యర్థులు శుక్రవారం రాష్ట్ర రాజధాని లక్నోలో నిరసన ప్రదర్శలనకు దిగారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని యోగి సర్కారును డిమాండ్‌ చేశారు. ఎట్టకేలకు అభ్యర్థుల నిరసనలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల్లో మళ్లీ పరీక్షను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కాగా, పరీక్షా ప్రశ్నపత్రం లీకేజీ కేసు రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, యూపీలో ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌లు స్పందించారు. పరీక్ష రద్దు అనేది విద్యార్థులు, యువత ఐక్యతకు పెద్ద విజయమని రాహుల్‌ ఎక్స్‌ వేదికగా అభివర్ణించారు. ఉద్యోగ ఖాళీలు ప్రకటనలు కేవలం చూపించుకోవటానికేననీ, ఫీజుల రూపంలో అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, పేపర్‌లు లీకయ్యేలా చేసి, వాటిని రద్దు చేసే నాటకం బీజేపీ చేస్తుందని అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు.

Spread the love