నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యాశాఖ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి యోగితా రాణా శుక్రవారం హైదరాబాద్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఇతర అధికారులు, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ కలిసి అభినందనలు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు పరిధిలో ప్రస్తుతం ఉన్న సమస్యలపై వారు చర్చించారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణ గురించి చర్చకు వచ్చింది. ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. వాటి గురించి అధికారులు వివరించారు. ఎప్‌సెట్ సహా వివిధ ప్రవేశవ పరీక్షల తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి రూపొందించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదానికి పంపించిన విషయం తెలిసిందే. వాటి గురించి యోగితారాణాకు శ్రీరాం వెంకటేశ్ గుర్తు చేశారు. ఇంకోవైపు విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ)తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కావాల్సి ఉందనీ, దాని గురించి ప్రస్తావించినట్టు తెలిసింది.
టీఎస్‌యూటీఎఫ్ అభినందనలు
విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన యోగితా రాణాను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్, కోశాధికారి టి లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. సంఘం డైరీని బహూకరించారు. నూతన కార్యదర్శి ఆధ్వర్యంలో సర్వీసు నిబంధనల సమస్యను పరిష్కరించి పర్యవేక్షణ వ్యవస్థ పటిష్టానికి చర్యలు తీసుకోవాలని కోరారు.