మీకు వేరే ముఖ్యమంత్రి లేరు..

You don't have any other chief minister..– ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌
– జర్నలిస్టులకు ఇండ్లస్థలాలివ్వండి.. : సర్కారుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి
– సరదాగా సాగిన జీరో అవర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
శాసనసభలో శుక్రవారం చేపట్టిన జీరో అవర్‌ అధికార, ప్రతిపక్షాల మధ్య సరదా పంచులతో సాగింది. మీ పార్టీలో పది మంది ఉండొచ్చు.. కానీ బయట రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రే ఉంటారు.. మీకు వేరే ముఖ్యమంత్రి లేరు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబుకు మంత్రి కేటీఆర్‌ సరదాగా పంచ్‌ వేశారు. జీరో అవర్‌లో సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ మెడికల్‌ కాలేజీల్లో క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌, జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డుల అంశాలను ప్రభుత్వం దష్టికి తీసుకొచ్చారు. జగ్గారెడ్డికి కేటీఆర్‌ సమాధానం ఇస్తూ సంగారెడ్డి వరకు జగ్గారెడ్డి మెట్రో అడిగితే మేం ఇస్నాపూర్‌ దాకా మెట్రో మంజూరు చేశాం. ఆయన విజ్ఞప్తి మేరకు సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ కూడా ఇచ్చాం.ఈ రెండింటికి జగ్గారెడ్డి అభినందనలు చెప్తారని అనుకున్నాం. కానీ ఆయన అది చెప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మెడికల్‌ కాలేజీలో అంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మెడికల్‌ కాలేజీలన్నీ పేదల కోసమే. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండే. నాడు సీజేఐగా ఉన్న ఎన్‌వీ రమణతో సీఎం కేసీఆర్‌ దాదాపు 10 సార్లు స్వయంగా మాట్లాడారు. మా జర్నలిస్టుల సమస్యను పరిష్కరించండి అని మా ముఖ్యమంత్రే స్వయంగా, మన ముఖ్యమంత్రే స్వయంగా మాట్లాడారు. మీకు వేరే ముఖ్యమంత్రి లేరు ఆయనే. మీ పార్టీలో పది మంది ఉండొచ్చు.. కానీ బయట రాష్ట్రానికి ఒక్కరే ఉంటారు. మన అంటే నవ్వుతున్నందుకే మన ముఖ్యమంత్రి అని అంటున్నా శ్రీధరన్నా అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. దీంతో సభలో సభ్యులంతా నవ్వారు.
ములుగులో సీతక్కకు కూడా మెడికల్‌ కాలేజీ వచ్చింది. అక్క కూడా ఏం చెప్పదు. పెద్దపల్లిలో మెడికల్‌ కాలేజీ వచ్చింది.. శ్రీధరన్న కూడా చెప్పడు అని కేటీఆర్‌ అన్నారు. వీళ్లు దాస్తే కూడా దాగని సత్యాలు ఇవి. ములుగు బాగా అభివద్ధి చెందిందని మొన్న తాను పోయినప్పుడు స్థానికులు చెప్పారు. కలెక్టరేట్‌ వచ్చింది.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ వెలుగు వచ్చిందని చెప్పారు. సీతక్క వాళ్ల అమ్మానాన్నలకు కూడా పోడు భూముల పట్టాలు వచ్చాయి. ఇన్ని పనులు అవుతున్నాయి.. కానీ వారు థ్యాంక్స్‌ చెప్పరు. మాది సంస్కారం ఉన్న ప్రభుత్వం కాబట్టి ప్రతి సమస్యనూ పరిష్కరిస్తాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జీరో అవర్‌లో పద్మాదేవేందర్‌రరెడ్డి సుధీర్‌రెడ్డి, ఆత్రం సక్కు, గంప గోవర్థన్‌, పొడెం వీరయ్య, అక్భరుద్ధీన్‌ ఓవైసీ, రమేశ్‌, రాజాసింగ్‌, ఆనంద్‌, దివాకర్‌రావు తదితరులు తమ తమ నియోజకవర్గాల్లో స్థానికంగా నెలకొన్ని సమస్యలను ప్రస్తావించారు.

Spread the love