యువతికి మత్తుమందు ఇచ్చి సామూహిక లైంగికదాడి

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో 18 ఏళ్ల యువతిపై దారుణం చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల వేదికగా పరిచయమైన వ్యక్తులే ఆమెకు మత్తుమందు ఇచ్చి సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇన్‌స్టాలో యువతితో స్నేహం చేసిన ఇద్దరు యువకులు సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో మదంగిర్‌లోని కూడలి వద్దకు పిలిచారు. ఆమె వెళ్లేసరికి ఇద్దరు నిందితులూ యువతి కోసం ద్విచక్రవాహనంపై ఎదురుచూస్తున్నారు. తమతో రావాలని కోరగా యువతి నిరాకరించడంతో ఆమెను బెదిరించి బలవంతంగా మాలవీయనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు భోజనంలో మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించిన యువతి.. పోలీసులను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వయస్సు 19, 21 ఏళ్లు ఉంటుందని తెలిపారు.

Spread the love