నవతెలంగాణ – హైదరాబాద్: యువ రచయితలు నిరంతర అధ్యయనం చేయడం వల్లనే మంచి కవిత్వాన్ని రాయగలరని సాహితీవేత్త డా. అమ్మంగి వేణుగోపాల్ సూచించారు. హైదరావాద్ బుక్ ఫెయిర్ లో భాగంగా గద్దర్ ప్రాంగణంలోని రవ్వా శ్రీహరి వేదికపై శుక్రవారం సాయంత్రం యువతరం కవుల అంతరంగ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వేణుగోపాల్ మాట్లాడుతూ…. పరిశ్రమించి ప్రతిభతో సమకాలిన ప్రక్రియాలను యువతరం సాధించాలని చెప్పారు. డిజటల్ యుగంలో కనీసం యువ కవులు… చేతిలోని సెల్లును దూరం చేసి… ఆ దూరాన్ని కవిత్వంతో భర్తీ చేసుకోవాలని పేర్కొన్నారు. యువతరం కవుల అంతరంగ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న 10 మంది యువ కవులు దొంతం చరణ్, పేర్ల రాము, కల్యాణి కుంజ, లిఖిత్ కుమార్ గోదా, శ్రీనిధి విప్లవశ్రీ, రవీంద్ర రావెళ్ల, గుర్రాల అనూష, తలారి సతీష్ కుమార్, సాత్విక నన్నెబొయిన, మహేష్ వేల్పుల, ఆకాశ్ మునిగాల, వీరు కవిత్వం రాయడానికి కల కారణాలు.. ప్రేరణలు పంచుకున్నారు. పలువురు తాము తమ జాతి కోసమే కవిత్వం రాస్తున్నామని చెప్పగా… మరికొందరు. కవిత్వం లేకపోతే చచ్చిపోతానంటూ.. కవితే నన్ను బతికిస్తుందంటూ గంభీర వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రసేన మాట్లాడుతూ.. యువ కవులు అమ్మాయిలు, అబ్బాయి ఇరువురు తమ మూలలకు సంబంధించిన కవిత్వం రాయడం బావుందని… ఇక తెలంగాణకు రాబోయే 30 ఏండ్లకు సాహితీ రంగ బీజాలుపడ్డట్లేనని తెలిపారు. కవి యాకూబ్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు గౌరీ శంకర్ కూడా పాల్గొన్నారు.