మీ వ్యాఖ్యలు అవాస్తవం

Your comments are untrue– ప్రజలు పని చేయడం లేదనడం సరికాదు
– ఉచిత రేషన్‌పైనే మనుగడ సాధ్యమా?
– జస్టిస్‌ గవారుకి 300 మందికి పైగా ప్రముఖుల లేఖ
న్యూఢిల్లీ: ఉచితాలపై న్యాయమూర్తి జస్టిస్‌ గవారు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభ మాజీ సభ్యురాలు, సీపీఐ (ఎం) నేత బృందా కరత్‌ తప్పు పట్టిన విషయం విదితమే. తాజాగా 300 మందికి పైగా ప్రముఖులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవారు వ్యాఖ్యలను 300 మందికి పైగా ప్రముఖులు ఖండిస్తూ..ఇది జాతికి సిగ్గుచేటని అభివర్ణించారు. ‘ఉచితాల’పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవారు ఇటీవల చేసిన వ్యాఖ్యలను 300 మందికి పైగా ప్రముఖులు ఖండిస్తూ బహిరంగ లేఖ రాశారు. వీరిలో హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, పాత్రికేయులతో పాటు గూడు లేని, అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్న పలు సంఘాల ప్రతినిధులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో గృహవసతి లేని పేదల కోసం షెల్టర్లు నిర్మించాలంటూ ఈఆర్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ గవారు, జస్టిస్‌ ఏజీ మసిహ్‌తో కూడిన బెంచ్‌ విచారణ జరుపుతోంది. ఆ సందర్భంగా జస్టిస్‌ గవారు ఉచితాలు పరాన్నజీవులను సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘ఆయన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థలో పేదల వ్యతిరేక పక్షపాత ధోరణికి అద్దం పడుతున్నాయి. పట్టణ పేదల్లో గూడు లేని వారు అత్యంత దుర్బలురు. అయితే పట్టణ అనధికారిక ఆర్థిక వ్యవస్థకు వారు వెన్నెముక వంటి వారు. నిర్మాణ పనులు, బరువులు మోయడం, పారిశుధ్య పనులు, వివాహ కార్యక్రమాల్లో క్యాటరింగ్‌ వంటి కష్టతరమైన విధులు నిర్వర్తిస్తుంటారు’ అని వారు ఆ బహిరంగ లేఖలో వివరించారు. ‘నిరాశ్రయులను పరాన్నజీవులు అని పిలవడం నిర్దయకు, బండబారిన మనస్తత్వానికి సంకేతం. పౌరులు…ముఖ్యంగా దుర్బలులైన వారి హక్కులు, స్వేచ్ఛను రక్షించే బాధ్యత కలిగిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి నుండి ఈ వ్యాఖ్యలు ఆశించలేదు. బాధితులను నిందించడమో లేదా అవమానించడమో కాకుండా వారి జీవితాలను రక్షించడం సమాజం, ప్రభుత్వ సంస్థల బాధ్యత. నగర నిర్మాతలైన బడుగు జీవుల మరణాలను నివారించే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయక పోవడం జాతికి సిగ్గుచేటు’ అని ఆ బహిరంగ లేఖలో ప్రముఖులు విమర్శించారు.

Spread the love