యువ‌త‌.. ఔనంటేనే ‘నేత‌’

గత శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో యువ ఓటర్లదే కీలక భూమిక. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైతం యువత ఓట్లే కీలకం. దేశ గతిని మార్చేది, వ్యవస్థలో మార్పునకు నాంది పలికేది ఓటే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగిన భారతదేశంలో ఎన్నికల నిర్వహణను కుంభమేళాగా పరిగణిస్తారు. దేశీయంగా ప్రస్తుతం 97 కోట్ల మంది ఓటర్లు లెక్కతేలారు. చైతన్యశీలురైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి దీపస్తంభాలు.

దేశ భవిత, పౌరుల సంక్షేమానికి పాటుపడే శక్తియుక్తులు, విచక్షణ కలిగిన నేతలు చట్టసభల్లో కొలువుతీరితేనే మన ఎన్నికల ప్రక్రియకు సార్థకత లభిస్తుంది. ఓటర్లు నిస్తేజం వీడి విజ్ఞతతో నిజాయతీపరులైన నేతలకు పట్టం కడితేనే భారత్‌లో వెలుగురేఖలు సాధ్యమవుతాయి. భావిభారత నిర్మాణంలో యువ ఓటర్లదే నిర్ణయాత్మక పాత్ర అన్నది కాదనలేని సత్యం. అయితే, శక్తిమంతమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో 18 ఏండ్లు నిండిన నవతరం నిర్లిప్తత దేశానికి ఎంతమాత్రం క్షేమదాయకం కాదు.
ప్రజాస్వామ్యానికి ఇరుసు
దేశ ప్రగతి వాహనానికి ఇరుసు లాంటివారు యువతే. పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఎన్నికల్లో విధిగా దాన్ని వినియోగించుకుంటేనే భారతదేశ రూపురేఖలు మారతాయి. బెల్జియం, బ్రెజిల్‌, ఇటలీ, పెరూ తదితర దేశాల్లో ఓటువేయని వారికి జరిమానాలు విధిస్తారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశమున్న ఇండియాలో యువత దానిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం సరికాదు. ఆన్‌లైన్‌లో, సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజూ చాలా సమయ వెచ్చించే యువత సరైన నేతలను ఎన్నుకోవడానికి ఓటుహక్కు నమోదుపై దష్టి సారించాలి. అదే స్ఫూర్తితో ఎలెక్షన్‌ రోజున(రేపు) పోలింగ్‌ బూత్‌ బాట పట్టి ఓటరు చైతన్యం ప్రదర్శించాలి.
ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు
ఈ ఎన్నికల్లో యువ ఓట్లశాతం పెంచడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిలో చైతన్యం కలిగించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విధులు నిర్వహించే అంటే పోలింగ్‌ అధికారి(పీవో) నుంచి అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారి (ఏపీవో), పోలింగ్‌ సిబ్బంది అందరూ యువ అధికారులే ఉంటారు.
భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు
భారత్‌ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్‌, అత్యధిక యువ జనాభా కలిగిన దేశం కూడా. 2024 ఎన్నికల్లో అదనంగా 5% శాతం అనగా నాలుగు కోట్ల 10 లక్షలమంది, కొత్తగా 18-25 సంవత్సరాల వయస్సు కలిగిన వారు నూతన ఓటర్లుగా తమ తొలిసారి ఓటుహక్కును వినియోగించుకొనున్నారు. ఈ యువ ఓటర్లే కీలకం అని, అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి. వీరు విద్యావంతులు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు. వీరిలో నూటికి తొంభై శాతం మంది సామాజిక మాధ్యమాల్లో విహరించే వారే. కావున యువత వారి ఆకాంక్షలకు అనుగుణంగా నేతలను ఎన్నుకోవాలి. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం ఆకాశం ఎత్తు పెరుగుతుంది. ధరలు మండిపోతున్నాయి. ప్రయివేటీకరణ, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, లే అవుట్లు దేశం అంతా విస్తరించి ఉన్న ప్రస్తుత తరుణంలో యువతకు విద్యా, నైపుణ్యాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలిగే నేతలను, ప్రభుత్వాలను ఎన్నుకోవాలి.
నోటాకైనా ఓటేయండి
నగరంలో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఓటు వేసేందుకు నగరవాసులు పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో వారిలో చైతన్యం నింపేలా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజాస్వామ్య పండగ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మరికొన్ని సంస్థలు పోస్టు కార్డుల ద్వారా ప్రచారాన్ని చేపడుతున్నాయి. ఇంకొన్ని సంస్థలు ‘నోటాకైనా ఓటేయండి’ అంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. నగరంలో 18నుంచి 39 ఏళ్ల వయసున్న యువకులు సుమారు 45 శాతం మంది ఉన్నారు. కానీ ఓటు వేసేందుకు వద్ధుల్లో ఉన్న ఉత్సాహం యువకుల్లో కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వారికి నచ్చే విధంగా సాంస్మృతిక కార్యక్రమాలు చేపడుతూ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్వచ్ఛంద సంస్థలు చైతన్యపరుస్తున్నాయి. మరికొన్ని సంస్థలు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి.
షేపింగ్‌ టుమారో బై ఓటింగ్‌ టుడే…
యంగిస్థాన్‌ ఫౌండేషన్‌ గత కొన్నేళ్లుగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఊకదంపుడు ఉపన్యాసాలకు బదులుగా యువత మెచ్చే స్టాండప్‌ కామెడీ, రాక్‌బ్యాండ్‌ల ద్వారా ఓటు విలువను తెలియజేస్తోంది. 18 ఏండ్లు వచ్చాయని ఎవరో చెబితే ఓటరుగా నమోదవడం తప్ప మరే ఆలోచన లేని యువతలో మార్పు తేవాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు యంగిస్థాన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు అరుణ్‌ తెలిపారు. ‘షేపింగ్‌ టుమారో బై ఓటింగ్‌ టుడే’ పేరుతో వేర్వేరు కార్యక్రమాలు చేపడుతున్నారు. యువతకు చేరువయ్యేలా తెలంగాణ లెట్స్‌ఓట్‌, ఫెస్టివల్‌ ఆఫ్‌ డెమోక్రసీ పేరిట సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వారికి నచ్చే విధంగా మరికొద్ది రోజుల్లో స్టాండప్‌ కామెడీ, స్లాం పొయెట్రీ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు బంద సభ్యులు తెలిపారు.
పోస్టుకార్డులతో ప్రచారం…
మెరు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పోస్టుకార్డులతో ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇందుకోసం విద్యార్థులు ఒక్కొక్కరు రెండు పోస్టు కార్డులను రూపొందించారు. వీటిని తమ బంధవులు, ఇరుగు, పొరుగు వారికి పంపతూ తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు.
యూత్‌ఫర్‌ యాంటీ కరప్షన్‌ (వైఏసీ)...
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ (వైఏసీ) సంస్థ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఓటు హక్కు వినియోగంపై విస్తతంగా ప్రచారం చేస్తోంది. ‘ఈ దేశం నాదే అంటున్నావు. దేశ పౌరుడి అని గర్వపడుతున్నావు. ఓటు నా బాధ్యత కాదు అనడం సబబేనా’ అంటూ ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. నాయకులు ఇష్టం లేకపోతే ‘నోటాకైనా సరే ఓటేరు’ అంటూ చైతన్యపరుస్తోంది. మరికొంత మంది సభ్యులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేస్తున్నారు.
పౌరసమాజం అప్రమత్తత ఆవశ్యం
మనదేశం లౌకిక రాజ్యం అని, భిన్నత్వంలో ఏకత్వం అనే విషయాన్ని మరిచిపోయారు. పౌర సమాజం ఇక్కడే, ఇటువంటి సందర్భంలో అప్రమత్తంగా ఉండాలి. వాస్తవాలను విశ్లేషణ చేయాలి. మంచి వివేకంతో భవిష్యత్తు భారత్‌ నిర్మించాలి. ఈ ప్రక్రియలో చదువుకున్న యువత కీలక పాత్ర పోషించాలి. నూతన యువ ఓటర్లే భవ్య భారతికి దిశానిర్దేశం చేయాలి. పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలవాలి అన్నా, భారత్‌ రాజ్యాంగ ఆశయాలు సాధించాలన్నా, ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద సమాఖ్య వ్యవస్థ భారత్‌లో మరింతగా ప్రాధాన్యత సంతరించుకోవాలి అంటే అందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. ప్రలోభాలకు లొంగకుండా, నీతిగా నిజాయితీగా ఓటు వేసి, భవిష్యత్తు భారత్‌ నిర్మించే వారికి అండదండలు అందించాలి. యువ ఓటర్లే కీలక పాత్ర పోషించాలి.

Spread the love