బిల్డింగ్‌ పైనుంచి దూకి..యూట్యూబర్ జంట మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : యూట్యూబర్ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఎత్తైన బిల్డింగ్‌ పైనుంచి దూకడంతో వారు మరణించారు. షూటింగ్ సమయంలో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో సహజీవనం చేస్తున్న ఈ జంట సూసైడ్‌ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల గర్విట్, 22 ఏళ్ల నందిని కలిసి యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ల కోసం షార్ట్ ఫిల్మ్‌లు రూపొందిస్తున్నారు. కాగా, సహజీనం చేస్తున్న గర్విట్‌, నందిని తమ టీమ్‌తో కలిసి డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలోని బహదూర్‌గఢ్‌కు చేరుకున్నారు. రుహీలా రెసిడెన్సీలోని ఏడవ అంతస్తులో ఒక ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నారు. ఐదుగురు సహచరులతో కలిసి అందులో నివసిస్తున్నారు. అయితే శనివారం ఉదయం 6 గంటల సమయంలో గర్విట్‌, నందిని కలిసి బిల్డింగ్‌ ఏడో అంతస్తు నుంచి కిందకు దూకారు. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మరణించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గర్విట్‌, నందిని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. షూటింగ్‌ తర్వాత గత రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన ఈ జంట మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో ఇద్దరూ కలిసి సూసైడ్‌ చేసుకున్నట్లుగా తెలుస్తున్నదని పోలీసులు తెలిపారు. నిర్ధారణ కోసం ఆధారాలు సేకరించడంతోపాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Spread the love