నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణలో జాప్యంపై అఫిడవిట్ రూపంలో నివేదికను సీబీఐ, ఈడీ దాఖలు చేశాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్‌లో దర్యాప్తు సంస్థలు వివరించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతోందని, వేగవంతంగా ట్రయల్ పూర్తి చేసేందుకు తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని, లేకపోతే కేసుల విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను శుక్రవారం జస్టిస్ అభరు ఎస్ ఒకా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. సీబీఐ తరపు న్యాయవాది ఎఎస్‌జి ఠాక్రే వాదనలు వినిపిస్తూ సీబీఐ, ఈడీ కేసుల స్టేటస్ వివరాలు గురువారం సాయంత్రం ఫైల్ చేసినట్టు ధర్మాసనానికి తెలిపారు. దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్ కాపీ తాము పరిశీలిస్తామని ధర్మాసనం బదులిచ్చింది. తాము కూడా పరిశీలించడానికి కొంత సమయం కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరారు. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించి తీర్పు ఇస్తామని జస్టిస్ అభరు ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది.