27 నుంచి ‘యువగళం’ పున:ప్రారంభం

నవతెలంగాణ – అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు బ్రేక్ ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టుగా యువగళం యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగదు. డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలోనే ముగియనుంది. దాదాపు రెండున్నర నెలలపాటు విరామం రావడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. 27న పున:ప్రారంభమై రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు.

Spread the love