వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది శరీరానికి చలువ చేసే పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. వీటిలో మజ్జిగది మొదటి స్థానం. అయితే కేవలం మజ్జిగనే తాగాలంటే బోర్‌గా అనిపిస్తుంది. అలా కాకుండా ఇంకాస్త టేస్టీగా, కమ్మగా ఉండాలనుకుంటే లస్సీలని ప్రయత్నించవచ్చు. మండుటెండల్లో పెరుగుతో అప్పటికప్పుడు చేసుకునే చల్ల చల్లని ఈ లస్సీలు ఒక్క గ్లాస్ తాగితే చాలు ఆ ఫీలింగ్ సూపర్ ఉంటుంది. అలాగే బాదం షేష్, ఫలూదా వంటివి కూడా శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాంటి వెరైటీల గురించి ఈరోజు తెలుసుకుందాం…
ఫలూదా
కావలసిన పదార్థాలు: పాలు – లీటరు, రోజ్ సిరప్ – ఫలూదాకు రంగు, రుచిని ఇచ్చే ప్రధాన ద్రవం, సేమియా – మొక్కజొన్న పిండితో చేసిన సన్నని సేమియా, సబ్జా గింజలు – నీటిలో నానబెట్టినవి, ఐస్‌క్రీం – వెనిలా (లేదా మీకు నచ్చిన ఫ్లేవర్), డ్రై ఫ్రూట్స్ – జీడిపప్పు, పిస్తా, బాదం పలుకులు, పండ్ల ముక్కలు, కోవా, గుల్కంద్
తయారీ విధానం: ముందుగా పాలను చిక్కగా అయ్యే వరకు మరిగించి చల్లార్చుకోవాలి. మార్కెట్లో దొరికే ఇన్‌స్టంట్ ఫలూదా పొడిని కూడా ఇందులో వాడుకోవచ్చు. సేమియాను విడిగా ఉడికించి వడకట్టి పక్కన ఉంచుకోవాలి. అనంతరం పొడవైన గాజు గ్లాసు తీసుకుని అందులో అడుగున రోజ్ సిరప్ వేయాలి. దానిపై నానబెట్టిన సబ్జా గింజలను ఒక పొరలా వేయాలి. తర్వాత ఉడికించిన సేమియా వేయాలి. దానిపై నుంచి ముందుగా చిక్కగా మరిగించుకున్న పాలను పోయాలి. గ్లాసు పైభాగంలో ఒక స్కూప్ ఐస్‌క్రీం వేసి, దానిపై డ్రై ఫ్రూట్స్ పలుకులు, పండ్ల ముక్కలతో అలంకరించాలి. అంతే అద్దిరిపోయే ఫలూదా సిద్ధమైపోతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు: ఫలుదాలో ఉండే పాలు, డ్రై ఫ్రూట్స్ శరీరానికి కావాల్సిన ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్ అందిస్తాయి. సబ్జా గింజలు శరీర వేడిని తగ్గించి, వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. ఇందులోని పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజ్ సిరప్‌లోని ఫ్లేవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.
స్వీట్ లస్సీ
కావాల్సిన పదార్థాలు: పెరుగు – 800 ఎంఎల్, చక్కెర – అర కప్పు (రుచికి తగినంత), పాలకోవా – రెండు టేబుల్ స్పూన్లు, యాలకులపొడి – ఒక టీస్పూన్ (ఆప్షనల్), సన్నని పిస్తా తరుగు – కొద్దిగా (గార్నిష్ కోసం).
తయారీ విధానం : ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మీగడతో ఉన్న చిక్కటి పెరుగు తీసుకోవాలి. దాన్ని బ్లెండర్‌తో తరకలు లేకుండా మొత్తం కలిసేలా బాగా చిలకాలి. అందులో చక్కెరను యాడ్ చేసి మరోసారి పంచదార మొత్తం కరిగి, వెన్న పైకి తేలి క్రీమి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. మీకు నచ్చితే టీస్పూన్ యాలకులపొడిని వేసి కలుపుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసుకున్నాక అందులో ఒక కప్పు ఐస్ కోల్డ్ వాటర్ పోసుకుని బ్లెండర్‌తో లో-స్పీడ్‌లో 2 నుంచి 4 నిమిషాలు బ్లెండ్ చేయాలి. వెన్న ఎంత బాగా పైకి తేలితే లస్సీ అంత టేస్టీగా ఉంటుంది. ఆ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాసులలోకి తీసుకుని వాటిల్లో కొద్దిగా పాలకోవా వేసి, సన్నని పిస్తా తరుగుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే సూపర్ టేస్టీగా ఉండే చల్ల చల్లని ”స్వీట్ లస్సీ” మీ ముందు ఉంటుంది.
బాదం షేక్
కావాల్సిన పదార్థాలు: బాదం పప్పులు – 100 గ్రాములు, పాలు – 2 లీటర్లు, కస్టర్డ్ పౌడర్ – నాలుగు టేబుల్ స్పూన్లు, చక్కెర – రుచికి తగినంత, కుంకుమ పువ్వు – రెండు చిటికెళ్లు, యెల్లో ఫుడ్ కలర్ – కొద్దిగా(ఆప్షనల్), సన్నగా కట్ చేసిన బాదం పలుకులు – కొన్ని, జీడిపప్పు పలుకులు – కొన్ని.
తయారీ విధానం: బాదం పప్పులో వేడి నీళ్లు పోసి ఒక గంట పాటు నాననివ్వాలి. తర్వాత బాదం పప్పుల పొట్టు తీసి వాటిలో మిక్సీ జార్‌లోకి తీసుకుని అందులోనే 400ఎంఎల్ పాలు పోసుకుని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ తీసుకుని అందులో 100ఎంఎల్ పాలు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న గిన్నెలో ఆరు టేబుల్ స్పూన్ల నీళ్లు తీసుకుని కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒకటిన్నర లీటర్ల చిక్కటి పాలు తీసుకొని హై ఫ్లేమ్‌లో ఒకట్రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెత్తని బాదం పేస్ట్‌ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్‌లో రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఐదారు నిమిషాలు మరిగించుకోవాలి. తర్వాత అందులో మీ రుచికి తగినంత చక్కెర, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత పాలలో కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ను వేసుకుని బాగా కలుపుకోవాలి. బాదం షేక్ కాస్త కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ బాదం పాల మిశ్రమం చిక్కబడే వరకు మరిగించుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మూతపెట్టి ఫ్రీజర్‌లో కనీసం రెండు గంటల ఉంచాలి. దాంతో అది సగం గడ్డ కడుతుంది, మరో సగం పాలు పాలుగా ఉంటుంది. అప్పుడు దాన్ని మరోసారి బాగా కలిపి మిక్సీ జార్‌లోకి తీసుకుని 30 సెకన్ల పాటు బ్లెండ్ చేసుకోవాలి. అనంతరం సర్వింగ్ గ్లాసులు తీసుకుని వాటిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని బాదం, జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ ”బాదం షేక్” రెడీ అయినట్టే.
డ్రైఫ్రూట్స్ లస్సీ
కావాల్సిన పదార్థాలు : పాలు – లీటర్, చక్కెర – పావు కప్పు, బాదం, పిస్తా, జీడిపప్పులు – పావు కప్పు(అన్నీ కలిపి), డ్రైఫ్రూట్స్ పలుకులు – రెండు చెంచాలు, కస్టర్డ్ పౌడర్ – రెండు చెంచాలు, కొద్దిగా – కుంకుమపువ్వు.
తయారీ విధానం : ముందురోజు రాత్రి పాలను బాగా మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో పంచదార వేసి కలపాలి. అందులో నుంచి పావు కప్పు పాలు తీయాలి. ఈ పాలలో కస్టర్డ్ పౌడర్ కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి. అనంతరం కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని తిరిగి మరిగించుకున్న పాలలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం చల్లారి గోరువెచ్చగా అయ్యాక తోడేయాలి. మరుసటి రోజు మిక్సీ జార్‌లో బాదం, పిస్తా, జీడిపప్పులను మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్‌ను తోడుకున్న పెరుగులో వేసి బాగా గిలకొట్టి మజ్జిగ చేయాలి. చివరగా అందులో సన్నని డ్రై ఫ్రూట్స్ పలుకులు, కుంకుమపువ్వు యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలు.
మండే ఎండల్లో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



