రక్తాక్షరాలతో లిఖించిన విప్లవ కావ్యం ఇది…
చెమట చుక్కలు చెక్కిన చరిత్ర శిలాఫలకం ఇది!
ఇది కేవలం క్యాలెండర్ మీద ఒక ఎర్రటి తేదీ కాదు!
శ్రమదోపిడీపై శ్రామికుడు చేసిన గర్జన!!
”హేమార్కెట్” వీధుల్లో చిందిన ఆ రక్తపు ఛారలు,
ఇప్పటికీ గ్లోబలైజేషన్ గోడల మీద ప్రశ్నిస్తూనే ఉన్నాయి…
ఎనిమిది గంటల పని హక్కు…
అది ఎవడో పెట్టిన భిక్ష కాదు!
ఉరికొయ్యలను ముద్దాడి సాధించుకున్న
ప్రాణ సమాన హక్కు!!
పెట్టుబడిదారి కోరల్లో…
కార్పొరేట్ అద్దాల మేడల కింద నలిగేది కేవలం మనిషి కాదు!
అతని ఆత్మగౌరవం, ఆకలి నిండిన కుటుంబం!!
లాభాల వేటలో నువ్వు యంత్రాన్ని చూస్తున్నావ్!
కానీ ఆ యంత్రం వెనుక కదిలేది ఒక సజీవ విప్లవం!!
ప్రభుత్వం మౌనమే ఆయుధంగా హక్కులను హరిస్తుంటే,
మనం మౌనాన్ని విడిచి…
కార్మిక వర్గమంతా మెరుపులా విరుచుకుపడాలి!
చట్టాలు చుట్టలై శ్రమను చుట్టేస్తుంటే,
ఐక్యతే ఉక్కు కవచమై వ్యవస్థల పునాదులను కదిలించాలి!
నాగలి పట్టిన రైతు కన్నీరు, సుత్తి పట్టిన కార్మికుని నిట్టూర్పు…
ఒక్కటైన రోజే అసలైన సమర జ్వాల!
ఈ మే డే… విశ్రాంతి కోసం ఇచ్చే సెలవు కాదు!
దోపిడీ అంతం కోసం ఎత్తిన సమర శంఖం!!
ఆకాశంలో ఎగిరే ఆ ఎర్రజెండా…
కేవలం గుడ్డముక్క కాదు!
వందల ఏళ్ల పోరాటాల నిప్పుకణిక!!
ప్రతి గుండెలో ప్రతిధ్వనించాలి ఒకటే నినాదం!
”మే డే జిందాబాద్!!
కార్మికవర్గ ఐక్యత వర్ధిల్లాలి!!!
- శ్రీహరి బలభక్తుల, 9494924923



