ప్రపంచ దేశాల ప్రగతిచక్రం ఆగకుండా తిరుగుతోందంటే దానికి ప్రధాన కారణం కార్మికుల కష్టార్జితమే. నాగరికత పుట్టినప్పటి నుంచి నేటి ఆధునికత సాంకేతిక యుగం వరకు సమాజ సౌభాగ్యానికి పునాది వేసింది కార్మికుడి చెమటచుక్కే. ప్రతి ఏడాది మే ఒకటిన జరుపుకునే మేడే ఒక పండగ కాదు, అది శ్రమజీవుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఎనిమిది గంటల పనిదినం కోసం, కనీస హక్కుల కోసం చికాగో వీధుల్లో కార్మికులు చిందించిన రక్తమే ‘మేడే’. అయితే ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం డిమాండ్‌తో 1886, మే1న నలభై వేల మంది కార్మికులు నిరసన చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత చికాగోలోని హే మార్కెట్‌లో లక్షలాదిమంది ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీ సులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు, నలభై మంది గాయపడ్డారు. అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు ఊపందుకున్నాయి. బ్రిటన్‌లోని హైడ్‌పార్క్‌లో 1890, మే1న చేపట్టిన ప్రదర్శనలో దాదాపు మూడు లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. రోజులో ఎనిమిది గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే వారి ప్రధాన డిమాండ్. ఇదే తరహాలో మిగతా యూరోపియన్ దేశాల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. దీంతో 1892లో అమెరికాలో ప్రజా ప్రయోజన నిర్మాణ ప్రాజెక్టుల్లో పనిచేసే కార్మికుల పని గంటలను 8గంటలకు కుదిస్తూ అమెరికా కాంగ్రెస్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ క్రమంలో చికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారి నెత్తురుతో నిండిన గుడ్డను ఎర్రజెండాగా లేవనెత్తి మే ఒకటిని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది.
తర్వాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడం మొదలైంది. యూరప్‌లో 1900 నుంచి 1920 వరకూ ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే1న నిరసనలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. తర్వాతి దశకాల్లో మే1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగానూ జరుపుకునే వారు. ఇటలీలో ముస్సోలిని, స్పెయిన్‌లో జనరల్ ఫ్రాంకో మే డే పైన అనేక ఆంక్షలను విధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాల్లో మే1ని సెలవు దినంగా పాటించడం మొదలైంది. ఆ తర్వాత అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. కార్మికులకు సంబంధించిన పలు సంక్షేమ పథకాలను చాలా దేశాలు ఆ రోజునే అమల్లోకి తీసుకొచ్చాయి. ఆ విధంగా అటు సంక్షేమ పథకాల అమలుతో పాటు నిరసన ప్రదర్శనలకు, కార్మిక పోరాటాలకు మే 1 వేదికగా మారింది. వేర్వేరు దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజునే మొదలై పలు ఇతర కార్మిక ఉద్యమాలు కూడా మే డే నాడే ప్రాణం పోసుకున్నాయి.మన దేశంలో చికాగో సంఘటన కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పని చేస్తామనే డిమాండ్‌తో 1862లోనే సమ్మె చేశారు. అయితే ఆ సమ్మె విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడిన తర్వాత కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం వల్ల మన దేశంలో 1923లో మొదటిసారి మే డే ను పాటించారు. అప్పటి నుంచి దేశంలో మే డేని పాటిస్తున్నారు.
1985 తర్వాత చోటుచేసుకున్న ప్రయివేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల కార్మిక చట్టాలు అంతగా అమలుకు నోచుకోవడం లేదు. కార్మికుల పని వాతావరణంతో పాటు వేతనాలు మెరుగవ్వాలన్నది చాలా కాలంగా కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్‌గా మారింది. ఈనాడు మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం ఉంటే అక్కడ కంపెనీలు పెడుతున్నాయి. అమెరికా లాంటి దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కార్మిక చట్టాలు అంతగా అమలు కానటువంటి దేశాల్లో కంపెనీలు పెడుతూ వాళ్ల చేత రోజుకు 10 నుంచి 12గంటల పాటు పని చేయిస్తున్నారు. ఇందుకు మన దేశం మినహాయింపేమీ కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమ దోపిడీ సర్వసాధారణం. ప్రాణాలను పణంగా పెట్టి నాటి కార్మికవర్గ పోరాటాలు సాధించిన ఫలాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నప్పటికీ, ఇప్పుడున్న మార్కెట్ శక్తుల వ్యూహాలు పాత పరిస్థితులను పునరావృతం చేస్తుండటం గమనించాలి. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, కనీస హక్కులను కాలరాస్తున్న పాలక వర్గాల దుర్నీతిని నేడు కండ్లారా చూస్తున్నాం. ప్రపంచ కార్మికవర్గం పోరాడి సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా కోల్పోయే దుస్థితి దాపురించింది. ఇప్పుడు మేడే స్ఫూర్తిని మరింత ఉత్తేజంతో కొనసాగించాలి. అందుకు మహాకవి శ్రీశ్రీని గుర్తుకు తెచ్చుకోవాలి. ”చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా? ఇకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరో వ్యక్తి, ఒక జాతిని వేరే జాతీ, పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై సాగదు” అంటూ శ్రీశ్రీ ఏనాడో చెప్పిన మాట ల్లోని ఆంతర్యాన్ని అందరూ గమనించాలి.
నాదెండ్ల శ్రీనివాస్
9676407140



