Friday, May 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఉధృతమౌతున్న బుద్ధగయ ఉద్యమం!

ఉధృతమౌతున్న బుద్ధగయ ఉద్యమం!

- Advertisement -

బీహార్‌లోని బుద్ధగయలో మహాబోధి ఆలయం ప్రపంచ బౌద్ధులకు చాలా విలువైన స్థలం! ఎందుకంటే, అక్కడే బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమైంది. అది సాధారణ శకానికి ముందు 6-5(బిసిఇ) శతాబ్దాల మధ్య. ఆ తరువాత మౌర్య చక్రవర్తి అశోకుడు మూడవ శతాబ్దం (బిసిఇ)లో ఈ ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టాడు. బోధి వృక్షం కింద బంగారు సింహాసనం వేయిం చాడు. అనేక శతాబ్దాలు అది బౌద్ధ క్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కానీ, సాధారణ శకం 12-13 (సిఇ) శతాబ్దాలలో ముస్లిం దండయాత్రలు జరగడం, ఇంకా అనేక కారణాల వల్ల బౌద్ధం క్షీణస్తూ వచ్చింది. అప్పుడే హిందూ మహంతులు ఆ ఆలయాన్ని ఆక్రమించి, అక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. సాధారణ శకం 19వ శతాబ్దం (సిఇ)లో శ్రీలంకకు చెందిన బౌద్ధుడు అనగారిక ధర్మపాల (17 సెప్టెంబర్‌ 1864 – 29 ఏప్రిల్‌ 1933) దీనిని పూర్తిగా బౌద్ధులకే అప్పగించాలని ఒక ఉద్యమాన్ని లేవదీశాడు.

బుద్ధుడికి జ్ఞానోదయమైన బుద్ధగయ స్వరూపం మార్చి, దాన్ని బ్రాహ్మణులు హస్తగతం చేసుకుని, పూజలు చేసుకుంటున్నారని తెలుసుకుని, అనాగరిక ధర్మపాల ఎంతో ఆవేదనతో భారతదేశం వచ్చాడు. ఇక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేసి తను ముందు నిలబడి ఉద్యమానికి ఊపిరిలూదాడు. బుద్ధుడి మీద గౌరవంతో అశోకుడు కట్టించిన కట్టడాలు, బోధివృక్షం కింద ఏర్పాటు చేసిన బంగారు ఆసనం వంటివన్నీ విలువ లేకుండా పోతున్నాయన్న వేదన ఆయన మనసును తీవ్రంగా గాయపరిచింది. ఈ అనగారిక ధర్మపాల శ్రీలంకకు చెందిన బౌద్ధ పునరుజ్జీవకుడు. అలాగే శ్రీలంక స్వాతంత్య్ర సమర యోధుడు. 30 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఖ్యాతిని ఆర్జించాడు. మూడు ఖండాలలో ఆయన కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉండేవి. బుద్ధుడు మొట్టమొదట తన బోధనలు ప్రారంభించిన సారనాథ్‌లో ధర్మపాల ఒక బౌద్ధాలయం కట్టించాడు. అందుకే సారనాథ్‌లో ధర్మపాల విగ్రహం ఉంది. ఏ దేశవాసులైనా వారి దేశంలో ఉద్యమాలు చేస్తారు. వారి దేశంలో కట్టడాలు కట్టించుకుంటారు. కానీ, ధర్మపాల విషయం వేరు. శ్రీలంక నుండి వచ్చి భారత దేశంలో ఇవన్నీ చేశాడు. ఇక్కడ మహాబోధి సొసైటీని ప్రారంభించి, దాని ద్వారా బుద్ధగయ ఉద్యమాన్ని చేయించి, దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఆ రోజుల్లో ఈయన ఉద్యమానికి విశ్వకవి రవీంద్రుడు, స్వామి వివేకానందలు మద్దతు తెలిపి బలపరిచారు.

స్వామి వివేకానంద, అనగారిక ధర్మపాల 1893లో తొలిసారి చికాగోలో జరిగిన ‘పార్లమెంట్‌ ఆఫ్‌ వరల్డ్స్‌ రిలిజియన్స్‌’లో కలుసుకు న్నారు. హిందూ ధర్మం గురించి వివేకానందుడు మాట్లాడితే, దక్షిణ ప్రాంతపు బౌద్ధం గురించి ధర్మపాల మాట్లాడాడు. అయితే, తర్వాత కాలంలో వివేకానందుడు బుద్ధుణ్ణి బౌద్ధ స్థాపకుడిగానే కాకుండా, మానవీయ విలువలకు ప్రతీకగా ప్రశంసించాడు. అలాగే బుద్ధగయ ఉద్యమంలో తను స్వయంగా పాల్గొనకపోయినా, ధర్మపాల మనోధైర్యాన్ని ఇనుమడింపజేశాడు.ఏ మతం వారి హరులు ఆ మతం వారికి ఉండాలన్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నాడు. బలంగా వాదించాడు కూడా! వివేకానందుడి ప్రసక్తి రాగానే ఆయన హిందూమత ఔన్నత్యం గురించి చికాగోలో మహాపన్యాసం చేశాడని మన హిందూభక్తులు గొప్పగా ప్రచారం చేసుకున్నారు కదా? మరి అంతకుమించిన గొప్ప ఉపన్యాసం అనగారిక ధర్మపాల బౌద్ధం గురించి ఇచ్చాడు. దాన్ని బయటికి రానివ్వరు, నిజానికి ఈ దేశపు గొప్పదనం హిందూ మతంలో లేదు. వేదాల్లో లేదు.

పురాణాల్లో లేదు. వీటన్నింటికీ మూలమైన బౌద్ధంలో ఉంది. ఇంకొంచెం లోతుల్లోకి పోతే జైనంలో ఉంది. చార్వాకంలో ఉంది. మనుషుల్లో దైవత్వాన్ని చూసే గుణం హిందువుల్లో ఉంటే, అస్పృశ్యత ఎందుకు పాటించారు? జనాన్ని ఎందుకు విభజించారు. స్త్రీకి సరైన విలువ ఎందుకు ఇవ్వలేదు వంటి ప్రశ్నలు వస్తాయి. శతాబ్దాలు గడుస్తున్నా ఆ ప్రశ్నలకు వైదిక మతం సమాధాన మివ్వలేదు.
”మన మీద మనకు విశ్వాసముండాలి. భగవంతుడి మీద కూడా విశ్వాసముండాలి – అదే మానవుడి విజయరహస్యం” అన్న వివేకానందుడి అభిప్రాయంలో మొదటిభాగం ఈ తరం పూర్తిగా స్వీకరిస్తుంది. కాని రెండోభాగాన్ని కొంతమంది స్వీకరించకపోవచ్చు. భిన్నాభిప్రాయాలుంటాయి కాదా? భగవంతుడి మీద విశ్వాసం ఉండాలనేది అందరికీ నచ్చకపోవచ్చుకదా? బాగున్నదల్లా హస్తగతం చేసుకోవడం, అది తమదే అని దుష్ప్రచారం చేసుకోవడం వైదిక మతస్తులకు అలవాటే, మరాఠా రాజు శివాజీని హిందూ మత ఉద్దారకుడన్నారు. ఆయన అసలు నైజాన్ని దాచిపెట్టారు. అలాగే వివేకానం దుడిని హిందూ మత ఉద్దారకుడన్నారు. చాలా విషయాలు ఆయనవి కూడా దాచిపెట్టారు. లేదా వాటిని మార్చి అబద్దాలు ప్రచారం చేశారు. ఉదా||స్వామి వివేకానంద హిందూ మతం మీద హేతుబద్దంగా గుప్పించిన ప్రశ్నాల్ని బయటికి రానివ్వలేదు. కావాలంటే ” స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవిత గాధ -1 పేజి 380 తిరగేయండి. విషయం మీకే బోధపడుతుంది. అందులో ఇలాంటి విషయాలున్నాయి.

”పౌరోహిత్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయండి! ప్రగతికి ఆటంకంగా ఉన్న పురోహితుల ముఠాను ఛిన్నాభిన్నం చేయండి. వారి హృదయాలెన్నటికీ వికాసం చెందవు. శతాబ్దాలుగా కొనసాగుతున్న మూఢనమ్మకాలకు ఈ విషయంలో ఏకచ్ఛత్రాధిపత్యానికి వారసులైన పురోహితుల ముఠాను ఎదుర్కోండి. ముందు పౌరోహిత్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయండి. మనుషులవ్వండి. మీమీ సంకుచిత దృక్పథం నుండి బయటికి వచ్చి, దృష్టిని విశాలం చేసుకోండి! ఇతర దేశాలు పురోగమించడాన్ని గమనించండి . మనిషిని ప్రేమిస్తున్నారా? మీ దేశాన్ని కూడా ప్రేమిస్తున్నారా? అయితే రండి – ఉన్నతమైన, ఉదాత్త మైన విషయాల కోసం అందరం కలిసి పాటుపడదాం. వెనక్కి తిరిగి చూడకండి. మనం ముందుకు దూసుకువెళ్లడం చూసి, మనవాళ్లే కొందరు అడ్డుపడొచ్చు. ఆప్తులు విలపించొచ్చు. ఏదిఏమైనా, వెనక్కి తిరిగి చూడకండి. ముందుకు వెళ్లండి!” వివేకానందుడి ఇలాంటి ఆలోచనలకు ప్రచారం లభించిందా?

ఇక బుద్ధగయ ఉద్యమానికి సంబంధించిన విషయానికి వస్తే – 1953లో వెలువడ్డ చట్టం ద్వారా బుద్దగయ సంయుక్త నిర్వహణలోకి వెళ్లింది. అక్కడే పెద్ద తప్పు జరిగింది. ఏమతానికి సంబంధించిన ప్రార్ధనా విధానాలు ఆ మతానికి ఉంటాయి కదా? బౌద్ధ క్షేత్రంలో కర్మ కాండలు, పిండ ప్రదానాలు, యజ్ఞాలు చేయడం అవసరమా? ”ఇలాంటివి ఏవీ విముక్తి మార్గాలు కావు” అని చెప్పిన బుద్ధుడి స్వంత స్థలంలో వైదిక మతస్తులు ఇవి అక్కడ కొనసాగిస్తున్నారు కదా? ఇది దేన్ని సూచిస్తుంది? కావాలని బలవంతంగా బౌద్ధాన్ని నాశనం చేసి, ప్రత్యామ్నాయంగా తమ విధానాలు అక్కడ కొనసాగాలన్న పట్టుదల తప్ప, మరొకటి కాదు గదా?

మన రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఇప్పుడు మనం ఎంతవరకు కాపాడుతున్నాం – అన్నది ప్రశ్న. ప్రతి మతానికీ స్వంత సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవస్థలు ఉన్నాయి కదా? క్రైస్తవుల చర్చిలోకి హిందువులు వెళ్లి పూజలు చేయడం లేదు. హిందువుల ఆలయాల్లోకి ముస్లింలు వెళ్లి నమాజు చదవడం లేదు. ఎందుకంటే, ఎవరి ప్రార్థనా స్థలాలు వారికి వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి, వాటిని అలా ఉండనివ్వాలి. సెక్యులరిజం ప్రాథమిక సూత్రం అదే కదా? ఒకరి ప్రార్థనా స్థలాన్ని మరొకరు ఆక్రమించి పూజలు చేయడం సబబుగా ఉందా? అంటే వైదికులకు ఇది శతాబ్దాల నుండి అలవాటైన పని. బౌద్ధారామాల్ని, జైన మందిరాల్ని మార్చి హిందూ దేవాలయాలుగా మార్చుకున్న ఘన చరిత్ర వారిది. ఆధారాలన్నీ స్పష్టంగా బయటపడ్డా కూడా జరిగిన పొరపాట్లు ఒప్పుకుని, సరిదిద్దుకోకుండా.. అదే తప్పు బుద్ధగయలో కూడా కొనసాగిస్తున్నారు. అయితే, ప్రపంచబౌద్ధులంతా ఏకమై, దాన్ని పూర్తిగా తమకు అప్పగించాలని ప్రభుత్వాలతో పోట్లాడుతూనే ఉన్నారు. స్వతంత్రత, సమానత్వం, న్యాయం గల రాజ్యాంగం కదా మనది? మరి ఆస్ఫూర్తిని మనమే కాపాడుకో లేకపోతే ఎలా?

బుద్ధుడు దశావతారాల్లో తొమ్మిదో అవతారమని కట్టుకథలు చెప్పడం సరే- అందుకు ఆధారాలేవీ? వైదిక మత గ్రంథాలలో బుద్ధుడిని గూర్చి గొప్పగా చెప్పుకున్న దాఖలాలు లేవు. ఉన్నా ఒకటి అరా బుద్ధుణ్ణి తిడుతూ ఉన్నాయి. తమ అవతార పురుషుణ్ణి తామే తిట్టుకోరుకదా? అలాగే బౌద్ధుల త్రిపిటకాలలో విష్ణుమూర్తి ఊసేలేదు. విష్ణుమూర్తి అవతారమే బుద్ధుడయినప్పుడు, ఆ విషయం బౌద్ధ గ్రంధాలలో కూడా ఉండాలి కదా? పోనీ, దేశవ్యాప్తంగా శిధిలమైన బౌద్ధక్షేత్రాలు వేల సంఖ్యలో ఉన్నాయి. బుద్ధుడు హిందూదేవుడని భావిస్తే, బ్రాహ్మణోత్తములంతా అక్కడికి వెళ్లి, వాటిని పునరుద్ధరించుకుని.. అక్కడ పూజలు చేయరెందుకూ? ఎప్పటికైనా, భారత రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛను గౌరవించా ల్సిందే! బుద్ధగయను బౌద్ధులకు అప్పగించాల్సిందే!! బౌద్ధ సంఘాలు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యావంతులు, ఆలోచనా పరులైన రాజకీయ నాయకులు ఎందరెందరో ఒక్కటై – బుద్ధగయను బ్రాహ్మణుల చెరనుండి విడిపించాలనీ, దాన్ని బౌద్ధులకు అప్పగించాలని- బ్రాహ్మణులు అక్కడ కర్మకాండలు ఆపేసి ఆ స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వాలు చోద్యం చూస్తూ కూర్చోవడం కాదు, చొరవ తీసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇన్నేళ్ల నుండి కాలేదు ఇక, ఇప్పుడేమి అవుతుందీ? – అని అనుకోవడం పొరపాటు. ఉద్యమం ఉగ్రరూపం దాలిస్తే- ఏదీ ఆగదు. చరిత్రను గుర్తించడం – సమానత్వం కోరడం ఏ విధంగానూ నేరం కాదు. అబ ద్ధాలు ఎన్నేళ్లు దాటేసుకుంటూ వచ్చినా.. తప్పదు – నిజం ముందు ఏదో ఒక రోజు నీరుగారి పోవాల్సిందే!చరిత్రను, బుద్ధుడి బోధనల్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తే చాలు- సమస్యకు సులువైన పరిష్కారం దొరుకుతుంది. డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ‘నవయానా’నికి ద్వారాలు తెరిచినప్పటి నుండి దేశంలో బౌద్ధ ఆలోచనాపరుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. అంటే, ప్రభుత్వాల మీద ఈ విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి పెరుగుతున్నట్లే!!

(1 మే 2026న బుద్ధగయలో భారీ ప్రదర్శన సందర్భంగా)
కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

ప్రొ.దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -