ఏప్రిల్‌లో 35 శాతం వృద్ధి నమోదు
రూ.4,621 కోట్ల జీఎస్టీ వసూళ్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్‌రావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.4,621 కోట్ల జీఎస్టీ వసూళ్లతో రాష్ట్ర ఆర్థిక ఉత్సాహానికి సంకేతమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న వేగం, పన్ను చెల్లింపుల మెరుగైన అనుసరణ కారణంగా ఈ పెరుగుదల నమోదైనట్టు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా మొత్తం రూ.4,621 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.3,433 కోట్లతో పోలిస్తే ఇది రూ.1,188 కోట్ల అధికమని వివరించారు. అంటే ఏడాదికోసారి 35 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒకే నెలలో ఇది అత్యధిక వసూళ్లుగా నమోదైందని తెలిపారు. అంతకుముందు గరిష్ట వసూళ్లు ఈ ఏడాది మార్చిలో రూ.4,231 కోట్లు నమోదైందని వివరించారు.
ఇటీవలి నాలుగు నెలలుగా రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రూ.నాలుగు వేల కోట్లకుపైగా కొనసాగుతున్నాయని తెలిపారు. జనవరిలో తొలిసారిగా ఈ మైలురాయి దాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పిందనీ, ఆర్థిక బలాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీతోపాటు వ్యాట్, పెట్రోల్, డీజిల్, లిక్కర్ పన్నులు, ప్రొఫెషనల్ ట్యాక్స్ వంటి ఇతర ఆదాయాలను కలిపి వాణిజ్య పన్నుల శాఖ మొత్తం రూ.7,570 కోట్ల ఆదాయం సేకరించిందని వివరించారు. ఇది గతేడాది రూ.6,210 కోట్లతో పోలిస్తే 22 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో నమోదైన పన్ను చెల్లింపుదారుల నుంచి సేకరించిన మొత్తం జీఎస్టీ రూ.7,181 కోటని పేర్కొన్నారు. ఇందులో సీజీఎస్టీ రూ.2,092 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.2,527 కోట్లు, ఐజీఎస్టీ రూ.2,562 కోట్లు ఉన్నాయని వివరించారు. ఈ విభాగంలో 12.6 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. ఈ వసూళ్లు రాష్ట్ర ఆర్థిక స్థితి బలంగా ఉందనీ, వ్యాపార కార్యకలాపాలు చురుకుగా ఉన్నాయని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



