అవినీతి, కుంభకోణాలను చూసి 20 ఏండ్లు ఓటేయరు ప్రభుత్వ అరాచకాలపై ప్రజల్లో ఆగ్రహం
ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తున్న బీజేపీ
గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనలు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీకి ఓటు వేసే అవకాశమే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాలు, అవినీతి, కుంభకోణాలు చూసి ప్రజలు మరో 20 ఏండ్ల పాటు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. శనివారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అడ్డగోలుగా హామీలిచ్చి కాంగ్రెస్ సబ్బండ వర్గాలను మోసం చేసిందన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని విమర్శించారు. అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ కమిషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూములతోపాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు మంత్రులే పాల్పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ అరాచకాలు చూసిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
పెంచిన సిలిండర్ ధరలను వెనక్కి తీసుకోవాలి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని కేటీఆర్ విమర్శించారు. గ్యాస్ సిలిండర్ ధరలను రూ.వెయ్యికిపైగా పెంచడమే ఒక ఉదాహరణగా చెప్పొచ్చని అన్నారు. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్న బీజేపీ నిర్వాకం వల్ల ప్రజలపై నిత్యావసర సరుకుల భారం పెరిగిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్డగోలు నిర్ణయాలు, బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచకుండా ఉండడంతోపాటు పెంచిన సిలిండర్ ధర పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.
అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం
త్వరలో జరిగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో త్వరలో జరిగే సర్ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలని అన్నారు. కాంగ్రెస్ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు కేటీఆర్ సూచించారు. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలకు సమయత్తం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పి సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



