వెనుకుండి నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తులు వేరు
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట ముమ్మాటికీ చెరువేనని, రెవెన్యూ, సర్వేఆఫ్ ఇండియా, నాసా అన్ని మ్యాప్‌లు, రికార్డులు సైతం ఇదే స్పష్టం చేస్తోందని హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంట చెరువు భూమి తనదే అని, అక్కడ తాను వ్యవసాయం కూడా చేసినట్టు ఎడ్ల సుధాకర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశం తాజాగా పెద్దఎత్తున చర్చకు తెరలేపింది. ప్రజల్లో అయోమయం సృష్టిస్తోంది. దీనిపై హైడ్రా కమిషనర్ స్పందించారు. శనివారం బుద్ధభవన్‌లోని హైడ్రాకార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చెరువుల అభివృద్ధి, హైడ్రా పనితీరు, వస్తున్న ఫిర్యాదులపై ఎలాముందుకు వెళ్తున్నారో కమిషనర్ వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అంబర్‌పేట బతుకమ్మ కుంటను హైడ్రా అభివృద్ధి చేయడంపై ఎడ్ల సుధాకర్ పిటిషన్ వేశారని తెలిపారు. 1986 నాటి అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఆయన వద్ద ఉందని, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటేనే రూల్ ప్రకారం చెల్లుబాటు అవుతుందన్నారు. బతుకమ్మ కుంట అభివృద్ధిపై డివిజన్ బెంచ్‌కు సుధాకర్ వెళ్లారని, కంటెంప్ట్ ఆర్డర్‌లో కోర్టు తమను తప్పుపట్టిందని హైడ్రా కమిషనర్ చెప్పారు. డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారం అక్కడ బోర్డులు, ఇతర నిర్మాణాలు తొలగించామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలను తాము పాటిస్తామని స్పష్టం చేశారు. సుధాకర్ అసలు అక్కడ చెరువే లేదని అంటున్నారని, కానీ 1990 నాటి నాసా శాటిలైట్ ఫొటోల్లో బతుకమ్మ కుంట కనిపిస్తోందన్నారు. 1970లో భారతీయ సర్వే ఆఫ్ ఇండియా నీటి సర్వేల్లోనూ పూర్వం నుంచే అక్కడ 10ఎకరాల చెరువు ఉన్నట్లు తేలిందన్నారు. ఎర్రకుంట పేరుతో 1975 పహనీలలో 563/-1తో బతుకమ్మ కుంట ఉందన్నారు. ఆ భూమిని చెరువుగా మార్చామనేది నిజం కాదన్నారు. అసలు చెరువులో ఉన్న భూమికి పట్టాలు ఎలా వస్తాయని కమిషనర్ ప్రశ్నించారు. కొన్ని సందర్భాలల్లో చెరువులో వ్యవసాయం చేయొచ్చని, అంతమాత్రానా చెరువుకు యజమాని అయిపోరన్నారు. చెరువులు, నీటివనరులు ప్రజల సొత్తన్నారు. తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తున్నట్టు తెలిపారు. వరదల నివారణకు చర్యలు తీసుకునేందుకు హైకోర్టు తమకు అనుమతి ఇచ్చిందన్నారు. మరోవైపు నార్సింగ్‌లోని ముష్కిమ్ చెరువు ఆక్రమణ కూల్చివేతలపై ముందుగానే సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. సున్నం చెరువు బాధితులతో సమావేశం ఏర్పాటు చేశామని, సీఎం ఆదేశాలతో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. ఐలాపూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణలపైనా డ్రైవ్ చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకూ హైడ్రా 2,093 ఎకరాల భూమిని రికవరీ చేసిందన్నారు. ఇప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం ఆ భూముల విలువ దాదాపుగా రూ.80 వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. హైడ్రా పరిధిలో 90 ఎఫ్‌ఐఆర్‌లు ఇప్పటివరకు నమోదయ్యాయని వెల్లడించారు. ఫాతిమా కాలేజ్ విషయంలో హైకోర్టు ఆదేశాలతో ఎఫ్‌టీఎల్ డిమార్కింగ్ చేయాలన్నారు. హైడ్రాలో 30వేల పిటిషన్లు ఉన్నాయని, అయితే 50 మంది అధికారులు మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నగరంలో మరిన్ని చెరువులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. తప్పుచేసిన అధికారులపై సైతం చర్యలు తీసుకోవాలని రిపోర్టులు పంపిస్తున్నామని, ఇప్పటివరకు దాదాపు 50మంది అధికారులపై విజిలెన్స్, ఏసీబీతోపాటు సంబంధిత శాఖలకు లేఖలు రాశామన్నారు. కొందరు భూకబ్జాదారులు హైడ్రాపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పేదలను ముందుపెట్టి సెంటిమె ంట్‌ను రాజేస్తున్నారని ‘ఐలాపూర్‌తోపాటు ఇతర ప్రాంతాలల్లో ఇదే జరిగిందన్నారు. హైడ్రా పేదల ఇండ్లజోలికి వెళ్లదన్నారు. తప్పుడు ప్రచారాలను మీడియా ప్రతినిధులు, ప్రజలు గమనించాలన్నారు.
బతుకమ్మకుంట ముమ్మాటికీ చెరువే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



