మన ప్రాంతం మన బాధ్యత పేరుతో బ్రోచర్ విడుదల
ప్రజల మన్ననలు పొందుతున్న చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం
నవతెలంగాణ – చండూరు
చండూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన మున్సిపాలిటీ పాలకవర్గం మున్సిపల్ కమిషనర్ మల్లేశంతో కలిసి 10 అంశాలతో కూడుకున్న ” మన ప్రాంతం- మన బాధ్యత” అనే బ్రోచర్లను మున్సిపాలిటీ కార్యాలయం లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మన ఇంటి నుండి ప్రారంభమైన చిన్నచిన్న అడుగులు… చండూరు మున్సిపాలిటీకి పెద్ద మార్పు అవుతుందని అన్నారు. ప్రజలందరూ బాధ్యతతో మెలగాలని, చండూరు పరిశుభ్రత, అభివృద్ధికై 10 అంశాలను ఈ బ్రోచర్లో వివరించామని, ఇందులో చెప్పిన విధంగా చండూరు అభివృద్ధికై మున్సిపాలిటీలోని ప్రజలందరూ సహకరించాలని కోరారు. మెయిన్ రోడ్డు మీద ఫ్లెక్సీలు ఉండకూడదని, రోడ్డుకిరువైపులా డ్రైనేజీకి బయటి భాగాల్లోనే ఫ్లెక్సీలుపెట్టాలని తెలిపారు. మెయిన్ రోడ్లపై చెత్తను పోయరాదని, చెత్తబుట్టలను వాడి మున్సిపాలిటీ చెత్తను సేకరించే వాహనాలు వచ్చినప్పుడు వేయాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో పందులు ఉండకుండా చర్యలు ప్రారంభమయ్యాయని, పెంపకం దారులకు పలుమార్లు నోటీసులు ఇచ్చామని తెలిపారు.
మెయిన్ రోడ్లపై వ్యాపారం నిర్వహించే తోపుడు బండ్లు డ్రైనేజీ బయట భాగంలో పెట్టుకోవాలని తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, వృధాగా ఎక్కడైనా నీరు పోతే మున్సిపాలిటీకి తెలియపరచాలని తెలిపారు. ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు పెరగకుండా ప్లాట్ల యజమానులు చూసుకోవాలన్నారు. ప్లాస్టిక్ ను వాడకుండా కాగితము, బట్ట సంచులను వాడాలని తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న గృహములకు అనుమతిని తీసుకోవాలని, ఇంటి పన్ను చెల్లించాలని, దుకాణం దారులు ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలన్నారు. ప్రజలను చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. వీటితోపాటు ప్రజలు సెల్ ఫోన్ లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని, డ్రగ్స్ ఎవరైనా వాడుతున్నారని తెలిసే తెలిస్తే పోలీసులకు తెలపాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పైన తెలుపబడిన అన్ని అంశాలతో ఉన్న బ్రోచర్లను విడుదల చేసి ప్రజలను చైతన్యపరుస్తున్నామని తెలిపారు.
వీటన్నింటిని చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం విజయవంతం చేయుటకు కంకణ బద్ధులై ఉన్నారని తెలిపారు. ఇప్పటికే పరిశుభ్రతలో భాగంగా చండూరులోని అన్ని డ్రైనేజీల్లో ప్రతినెలా బ్లీచింగ్ చల్లిస్తున్నామని, వాటర్ ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నామని, ప్రతిరోజు రోడ్లను శుభ్రం చేయిస్తున్నామని, మున్సిపాలిటీలోని అన్ని కాలనీలలో మంచినీటిని అందిస్తున్నామని, త్వరలోనే సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, మున్సిపాలిటీని అభివృద్ధిలో పయనింపజేస్తూ, ప్రజల మనలను పొందుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కమిషనర్ మల్లేశం, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, బుషిపాక వాసు, సామ సుజాత యాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాసులు, కొండ్రెడ్డి మధు, కోడి సుష్మా వెంకన్న, కలిమికొండ పారిజాత జనార్ధన్, కటకం రమేష్, కోఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, ఖలీల్, మొగుదాల వెంకన్న, షరీఫ్, సాయిరాం, అరవింద్, శ్రీరాములు తదితరులు ఉన్నారు.



